కాంగ్రెస్‌లోకి మరో భారాస ఎమ్మెల్యే!

మరో భారాస ఎమ్మెల్యే కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి రాజకీయ పార్టీల మధ్య ఒకవైపు వాదోపవాదాలు జరుగుతుండగా, మరోవైపు రాజేంద్రనగర్‌ భారాస ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Published : 20 Apr 2024 03:05 IST

సీఎంను కలిసిన ప్రకాశ్‌గౌడ్‌.. త్వరలో చేరిక

ఈనాడు, హైదరాబాద్‌: మరో భారాస ఎమ్మెల్యే కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి రాజకీయ పార్టీల మధ్య ఒకవైపు వాదోపవాదాలు జరుగుతుండగా, మరోవైపు రాజేంద్రనగర్‌ భారాస ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారం చేజిక్కించుకున్నా.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మాత్రం ఆ పార్టీకి ఒక్క సీటు కూడా లభించలేదు. గ్రేటర్‌ పరిధిలో పట్టు సాధించడంపై పార్టీ దృష్టి సారించింది. ఈ క్రమంలో ఖైరతాబాద్‌ భారాస ఎమ్మెల్యే దానం నాగేందర్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలతా శోభన్‌రెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరారు. ప్రకాశ్‌గౌడ్‌ కూడా కాంగ్రెస్‌లో చేరతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావులు ఆయనతో భేటీ అయి చర్చించారు. అనంతరం వారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌లు కొద్దిసేపు చర్చించుకున్నారు. భారాస ఎమ్మెల్యే ఒకట్రెండు రోజుల్లో తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో ప్రకాశ్‌గౌడ్‌ 32 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈయనకు లక్షా 21 వేల ఓట్లు రాగా... భాజపా అభ్యర్థికి 89వేలు, కాంగ్రెస్‌కు 82 వేలు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌లో ప్రకాశ్‌గౌడ్‌ చేరిక చేవెళ్ల నియోజకవర్గంలో ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇప్పటివరకు ముగ్గురు భారాస ఎమ్మెల్యేలు- దానం నాగేందర్‌(ఖైరతాబాద్‌), కడియం శ్రీహరి(స్టేషన్‌ ఘన్‌పూర్‌), తెల్లం వెంకట్రావ్‌(భద్రాచలం) కాంగ్రెస్‌లో చేరారు. ప్రకాశ్‌గౌడ్‌ చేరితే ఆ సంఖ్య నాలుగుకు చేరనుంది.

  • ఇటీవల భాజపాకు రాజీనామా చేసిన వరంగల్‌ మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శుక్రవారం ఆయనకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ఉన్నారు.
  • ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే రాములునాయక్‌ శుక్రవారం భారాసకు రాజీనామా చేశారు. ఈయన కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిసింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని