రెండో రోజు 57 నామినేషన్లు

రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు రెండో రోజైన శుక్రవారం 57 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రెండు రోజుల్లో కలిపి దాఖలైన నామినేషన్ల సంఖ్య 99కి చేరింది.

Published : 20 Apr 2024 03:15 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు రెండో రోజైన శుక్రవారం 57 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రెండు రోజుల్లో కలిపి దాఖలైన నామినేషన్ల సంఖ్య 99కి చేరింది. భాజపా, భారాసల నుంచి అయిదుగురు చొప్పున, కాంగ్రెస్‌ నుంచి నలుగురు నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు. మిగిలిన వారంతా స్వతంత్రులు, ఇతర పార్టీలకు చెందిన వారే. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేయగా.. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ తదితరులు హాజరయ్యారు. కరీంనగర్‌ నుంచి బండి సంజయ్‌ పక్షాన ఆయన కుటుంబసభ్యులు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. ధర్మపురి అర్వింద్‌ (నిజామాబాద్‌), బూర నర్సయ్యగౌడ్‌ (భువనగిరి), తాండ్ర వినోద్‌రావు (ఖమ్మం) నామినేషన్లు వేశారు. భారాస నుంచి నామినేషన్లు వేసిన వారిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ (పెద్దపల్లి), బాజిరెడ్డి గోవర్ధన్‌ (నిజామాబాద్‌), ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ (నాగర్‌కర్నూల్‌), కాసాని జ్ఞానేశ్వర్‌ (చేవెళ్ల), టి.పద్మారావుగౌడ్‌ (సికింద్రాబాద్‌) ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ (మహబూబాబాద్‌), వంశీకృష్ణ గడ్డం (పెద్దపల్లి), ఆత్రం సుగుణ పక్షాన (ఆదిలాబాద్‌), చల్లా వంశీచంద్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌) నామినేషన్లు వేశారు. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ నామినేషన్‌ వేశారు.


సికింద్రాబాద్‌, నిజామాబాద్‌లలో అత్యధికం

సికింద్రాబాద్‌, నిజామాబాద్‌ నియోజకవర్గాల్లో  అత్యధికంగా ఆరుగురు చొప్పున నామినేషన్లు వేశారు. మల్కాజిగిరి, మహబూబ్‌నగర్‌, భువనగిరిలలో అయిదుగురు చొప్పున, మెదక్‌, నల్గొండ,  మహబూబాబాద్‌లో నలుగురు చొప్పున, పెద్దపల్లి, జహీరాబాద్‌, చేవెళ్ల, వరంగల్‌లో ముగ్గురు వంతున, హైదరాబాద్‌లో ఇద్దరు, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నాగర్‌కర్నూల్‌, ఖమ్మం నియోజకవర్గాల్లో ఒక్కొక్కరు చొప్పున నామినేషన్లు వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని