జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై తిరుగుబాటు

వైయస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కోటకు బీటలు వారుతున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా ఇటీవల ముస్లింలు వైకాపా కార్యాలయాన్ని ముట్టడించగా తాజాగా నేడు మైలవరం మండలానికి చెందిన వైకాపా నాయకులు (ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి వర్గం) తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు.

Published : 20 Apr 2024 04:42 IST

ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయం
పార్టీ వీడాలని యోచన

జమ్మలమడుగు, జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే: వైయస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కోటకు బీటలు వారుతున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా ఇటీవల ముస్లింలు వైకాపా కార్యాలయాన్ని ముట్టడించగా తాజాగా నేడు మైలవరం మండలానికి చెందిన వైకాపా నాయకులు (ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి వర్గం) తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. ఎమ్మెల్యే తీరుకు విసిగి పోయిన నాయకులు శుక్రవారం వైయస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్‌.ఉప్పలపాడు గ్రామంలో వైకాపా నాయకుడు శ్రీనివాసులురెడ్డి ఇంట్లో సమావేశమై రానున్న ఎన్నికల్లో సుధీర్‌రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయాలనే నిర్ణయానికి వచ్చారు. సుధీర్‌రెడ్డిని వ్యతిరేకిస్తూ మైలవరం భీమా నాయక్‌, కర్మలవారిపల్లె పుల్లారెడ్డి, తొర్రివేముల గురివిరెడ్డి, వద్దిరాల లక్షుమయ్య, నవాబుపేట రఘనాథరెడ్డి, గొల్లపల్లె హుసేన్‌రెడ్డి, దొమ్మరనంద్యాల నారాయణ, ధన్నవాడ జయరామిరెడ్డి, పురుషోత్తం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పీఆర్‌ వర్గానికి చెందిన నాయకులను ఎమ్మెల్యే పట్టించుకోకుండా అణచివేయాలని చూస్తున్నారని సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. నియోజకవర్గంలో తానొక్కడినే నాయకుడినని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిది ఏముందని అంటూ నిర్లక్ష్యం చేస్తున్నారని.. వారు ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఆయన ఓటమికి పనిచేయాలని కొంతమంది నాయకులు అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ సందర్భంగా వైకాపా నాయకుడు శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిపై గౌరవంతో వైకాపాలో ఎన్ని అవమానాలు ఎదురైనా భరిస్తూ వచ్చామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా తరఫున తామంతా స్వచ్ఛందంగా పనిచేసినా ఎమ్మెల్యే తమను గుర్తించలేదన్నారు. అందుకే పార్టీని వీడే యోచనలో ఉన్నామన్నారు. తనకు రూ.4 కోట్ల బిల్లు రావల్సి ఉండగా ఎంపీ అవినాష్‌రెడ్డితో చెప్పి మంజూరు కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పీఆర్‌ వర్గీయులను వైకాపా అధిష్ఠానం సైతం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. రెండు మూడు రోజుల్లో ఇతర నాయకులతో సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చి పార్టీని వీడతామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని