Yashawanth Sinha: అధ్యాపకుడు.. ఐఏఎస్‌ అధికారి

విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగుతున్న యశ్వంత్‌ సిన్హా స్వస్థలం- బిహార్‌ రాజధాని పట్నా. ఆయన 1937 నవంబరు 6న జన్మించారు. రాజనీతి శాస్త్రంలో పట్టా పొందారు. పట్నా విశ్వవిద్యాలయంలో రెండేళ్ల పాటు అధ్యాపకుడిగా పనిచేశారు. 1960లో సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. సబ్‌ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా, బిహార్‌

Updated : 22 Jun 2022 09:03 IST

సమర్థ నాయకుడిగానూ పేరు

యశ్వంత్‌ సిన్హా ప్రస్థానమిదీ..

ఈనాడు, దిల్లీ: విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగుతున్న యశ్వంత్‌ సిన్హా స్వస్థలం- బిహార్‌ రాజధాని పట్నా. ఆయన 1937 నవంబరు 6న జన్మించారు. రాజనీతి శాస్త్రంలో పట్టా పొందారు. పట్నా విశ్వవిద్యాలయంలో రెండేళ్ల పాటు అధ్యాపకుడిగా పనిచేశారు. 1960లో సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. సబ్‌ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా, బిహార్‌ ఆర్థిక శాఖలో ఉన్నతాధికారిగా, జాతీయ రహదారుల శాఖ సంయుక్త కార్యదర్శిగా.. ఇలా వివిధ హోదాల్లో 24 ఏళ్లపాటు పనిచేశారు. 1984లో ఉద్యోగానికి రాజీనామా చేసి జనతా పార్టీలో చేరారు. రెండేళ్లలోనే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థానానికి ఎదిగారు. 1988లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. తర్వాత జనతాదళ్‌లో చేరి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 1990లో కేంద్రంలో ఏర్పడిన చంద్రశేఖర్‌ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా నియమితులై 1991 జూన్‌ వరకు పనిచేశారు. 1996లో భాజపాలో చేరారు. 1998, 1999, 2009 సార్వత్రిక ఎన్నికల్లో హజారీబాగ్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వాజ్‌పేయీ మంత్రివర్గంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా విధులు నిర్వర్తించారు. 2009లో భాజపా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. నరేంద్ర మోదీ, అమిత్‌ షాల ఆధ్వర్యంలోని కమలదళంతో ప్రజాస్వామ్యం పెను ప్రమాదం ఎదుర్కొంటోందని ఆరోపిస్తూ 2018లో పార్టీని వీడారు. 2021లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా నియమితులయ్యారు. యశ్వంత్‌ సిన్హాకు ఇద్దరు కుమారులు (జయంత్‌, సుమంత్‌), ఓ కుమార్తె (షర్మిల) ఉన్నారు. భాజపా దిగ్గజ నేత ఎల్‌.కె.ఆడ్వాణీకి సిన్హా సన్నిహితుడు. రాజకీయాల్లో సమర్థ నాయకుడిగానూ పేరు తెచ్చుకున్నారు. ఆదిత్య సిన్హాతో కలిసి ‘‘ఇండియా అన్‌మేడ్‌’’ అనే గ్రంథాన్ని ఆయన రచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని