Updated : 30 Jun 2022 11:30 IST

Bandi Sanjay: తెరాస, కాంగ్రెస్‌ కుమ్మక్కు

ఎన్నికల్లో కలిసి పోటీచేసే అవకాశం

ఎన్ని కుయుక్తులు పన్నినా అధికారం మాదే

రాష్ట్రంలో మా పార్టీ ఎంతో బలంగా ఉంది

‘ఈనాడు’ ఇంటర్వ్యూలో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ 

ఈనాడు - హైదరాబాద్‌


కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరించడానికి సిద్ధంగా ఉంది. కానీ కావాలని తెరాస.. భాజపాను బద్నాం చేసే కుట్రలు చేస్తోంది. సీఎం కేసీఆర్‌ ప్రధాని మోదీని పలుమార్లు కలిశారు. ఆయన అప్పట్లో భాజపాను విమర్శించలేదు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో మా పార్టీ బలపడటంతో తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారు. 

  -సంజయ్‌


రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తొలగించి, అంబేడ్కర్‌ రాజ్యాంగం మేరకు తెలంగాణను నిర్మించడమే తమ పార్టీ లక్ష్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. తెరాసకు తెలంగాణలో స్థానం లేదని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా భాజపా అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయన్నారు. తెరాస, కాంగ్రెస్‌ కలిసి పోటీచేసే అవకాశం ఉందని చెప్పారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి, ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేకపోవడంతో కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌లో జులై 2, 3 తేదీల్లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సంజయ్‌ ‘ఈనాడు’ ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.

జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ను ఎంచుకోవడం వెనుక మీ  వ్యూహాలేమిటి?

గత నెలలో జైపుర్‌లో జరిగిన పదాధికారుల సమావేశంలో.. జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించాలని మా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు విజ్ఞప్తి చేశాం. తెలంగాణలో ప్రజలు తెరాసకు వ్యతిరేకంగా ఉన్నారని వివరించాం. ప్రజాసమస్యలపై పోరాడుతున్న కార్యకర్తలను రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోందని చెప్పాం. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు భరోసా కల్పించేలా పార్టీ సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహించేందుకు పార్టీ అంగీకరించింది. పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సందర్శించనున్నారు. జులై 3న నిర్వహించే బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లూ చేశాం. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా, నడ్డాతో పాటు పార్టీకి చెందిన అన్ని రాష్ట్రాల సీఎంలు పాల్గొంటారు. వర్షం పడినా ఇబ్బంది లేకుండా ఉండేలా షెడ్లు వేస్తున్నాం. కనీసం 10 లక్షల మంది ఈ సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం.

మీరు రెండు విడతలు ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. దాని ఫలితం ఏమిటి?

ప్రజలు ఈ యాత్రకు ఎక్కువగా రావడంతో కేసీఆర్‌ కుటుంబం భయపడి ఇష్టానుసారం వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో మా పార్టీ శక్తివంతమైనది. రుణమాఫీ, పోడు భూములు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, రెండు పడక గదుల గృహాలు, భూకబ్జాలు తదితర అంశాలపై కొట్లాడాం. మా పోరాటాన్ని చూసి భయపడి, ఎదుర్కొనేందుకు చేతకాక కాంగ్రెస్‌, ఎంఐఎం, కమ్యూనిస్టులతో కలిసి తెరాస కుట్రలు చేస్తోంది.

కాంగ్రెస్‌ పార్టీపై జనం దృష్టి లేకుండా చేయడానికే తెరాస, భాజపా పరస్పరం విమర్శించుకుంటున్నాయన్న ఆరోపణలపై ఏమంటారు?

అలాంటి ఒప్పందం తెరాస.. కాంగ్రెస్‌లది. ఈ రెండూ అన్నింట్లో అవగాహనతో వ్యవహరిస్తున్నాయి. గతంలో రెండు పార్టీలూ కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్‌ నుంచి గెలిస్తే తెరాసకు వెళ్తారు. ఎన్నికల వరకు వేర్వేరుగా ఉండి.. ఆ తరువాత ఇద్దరూ కలిసి పోటీచేసే అవకాశాలున్నాయి. భాజపా సభ పెడితే పోటీగా కాంగ్రెస్‌ సభ పెడుతుంది. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎవరైనా జైలుకెళ్తున్నారా? తెరాస నాయకులు, మంత్రులు.. సోనియాను, రాహుల్‌ను ఒక్క మాటైనా అన్నారా?

జాతీయ కార్యవర్గ సమావేశాలతో తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇవ్వనున్నారు?

రాష్ట్రాభివృద్ధికి మోదీ సర్కారు అనేక నిధులు ఇస్తోంది. సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. సీఎం నిధులు దారి మళ్లించి ఆ సంక్షేమ పథకాలను నీరుగారుస్తున్నారు. వాటితో భాజపాకు పేరు వస్తుందని కేంద్రాన్ని విమర్శించడం పనిగా పెట్టుకున్నారు. తెరాస అవినీతి పెరగడంతో తెలంగాణను అభివృద్ధి చేసే భాజపాకు అవకాశమిద్దామని ప్రజలు భావిస్తున్నారు.

రాష్ట్రమే కేంద్రానికి ఎక్కువ ఆదాయమిచ్చింది. కేంద్రం ఇచ్చింది తక్కువే అని కేటీఆర్‌ అంటున్నారు?

తెరాస మంత్రుల సవాళ్లను అనేక సార్లు స్వీకరించి, సమాధానమిచ్చినా.. ఆ పార్టీ నాయకులు కేంద్రాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ధనిక రాష్ట్రం ఇప్పుడు అప్పుల పాలై జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేదు. తెలంగాణతో కేసీఆర్‌, ఆయన కుటుంబమే బాగుపడింది. అడ్డగోలు కమీషన్ల పేరిట తరతరాలు బతికేంత సంపాదించారు. విద్యుత్తు, బస్సు, ఆస్తిపన్ను.. ఇలా అన్నీ పెంచేశారు. పెట్రోలు మీద కమీషన్‌ తీసుకుంటున్నారు. కేసీఆర్‌ ఫాంహౌస్‌ విద్యుత్తు 40 గ్రామాలకు ఇవ్వొచ్చు. ఇప్పుడు ఉద్యోగాల కోసం యువత ఆత్మహత్యలు చేసుకుంటోంది.

మీ పార్టీలో అంతర్గత విభేదాల్ని ఎలా పరిష్కరించుకుంటారు?

మా పార్టీలో ఎక్కడా విభేదాలు లేవు. అవన్నీ కొందరి కల్పితాలు. అందరం కలిసి పనిచేస్తున్నాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేస్తున్నాం. అన్ని ఎన్నికల్లో మా ఓటింగ్‌ శాతం పెరుగుతూనే ఉంది. ఏ సర్వే చూసినా భాజపాకు అనుకూలంగానే వస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మా ప్రభుత్వం రావడం ఖాయం.


‘‘ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం. సమస్యను సామరస్యంగా పరిష్కరించేలా కేంద్ర నాయకత్వం ముందుకెళ్తుంది. ఎంఐఎం సంతోషం కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదు.’’


‘‘ఒవైసీ కుటుంబం ఆస్తులు పెంచుకోవడానికి, వాటిని కాపాడుకోవడానికి అధికారంలోని పార్టీలకు ఎంఐఎం కొమ్ము కాస్తోంది. మైనార్టీ ఓటు బ్యాంకు కోసం తెరాస, ఎంఐఎం కలిసి తిరుగుతున్నాయి. అయినా పాతబస్తీని ఎందుకు అభివృద్ధి చేయడం లేదో ముస్లిం మేధావి వర్గం ఆలోచించాలి.’’

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని