2న హైదరాబాద్‌కు యశ్వంత్‌ సిన్హా

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా  జులై 2న హైదరాబాద్‌ వస్తున్నారు. తనకు మద్దతు ఇస్తున్న తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కాంగ్రెస్‌, మజ్లిస్‌ ప్రజాప్రతినిధులతో వేర్వేరుగా

Published : 30 Jun 2022 05:23 IST

 తెరాస, కాంగ్రెస్‌, మజ్లిస్‌ ప్రజాప్రతినిధులతో భేటీలు

సీఎం కేసీఆర్‌తో కలిసి భోజనం

ఈనాడు, హైదరాబాద్‌: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా  జులై 2న హైదరాబాద్‌ వస్తున్నారు. తనకు మద్దతు ఇస్తున్న తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కాంగ్రెస్‌, మజ్లిస్‌ ప్రజాప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమవుతారు. శనివారం ఉదయం 11 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ఖైరతాబాద్‌లోని జలవిహార్‌లో తెరాస నేతలతో సమావేశమవుతారు. సీఎం, ప్రజాప్రతినిధులతో కలిసి భోజనం చేస్తారు. తర్వాత కాంగ్రెస్‌, మజ్లిస్‌ పార్టీల ప్రజాప్రతినిధులను కలుస్తారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రధాని మోదీ వచ్చే నెల 2న హైదరాబాద్‌ వస్తున్నారు. అదేరోజు యశ్వంత్‌ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఘన స్వాగతం పలకాలని కేసీఆర్‌ ఆదేశం

బేగంపేట విమానాశ్రయంలో యశ్వంత్‌సిన్హాకు ఘన స్వాగతం పలకాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సిన్హాకు స్వాగతం పలుకుతూ ప్రధాన రహదారులపై తెరాస భారీగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేయనుంది. విపక్షాల తరఫున రాష్ట్రపతి ఎన్నికల ప్రచార కమిటీలో సభ్యుడైన తెరాస ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి.. యశ్వంత్‌ పర్యటన సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


అప్పుడు మోదీ చెప్పింది అబద్ధమేనా: కేటీఆర్‌

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ బుధవారం ట్విటర్‌లో విమర్శించారు. ‘‘దేశంలోని అన్ని గ్రామాల్లో విద్యుదీకరణ పూర్తయిందని  మోదీ 2018 ఏప్రిల్‌లో స్వయంగా వెల్లడించారు. కానీ ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపది ముర్ము గ్రామానికి ఈ నెల 25న కరెంటు సౌకర్యం వచ్చింది. మరి ఆయన 2018లో చెప్పింది అబద్దమేగా? భాజపా మార్క్‌ అబద్దాలతో మోదీ దేశప్రజలను ఎన్ని సార్లు మోసం చేస్తారు?’’ అని కేటీఆర్‌ ట్విటర్‌లో విమర్శించారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జరిగిన హత్య చాలా బాధాకరమని మరో ట్వీట్‌లో తెలిపారు. ఆ క్రూరమైన హత్య వెనుక ఉన్న కారణం తనను తీవ్ర భయాందోళనకు, దిగ్భ్రాంతికి గురి చేసిందని  పేర్కొన్నారు. ఇలాంటి అనాగరిక హింసకు సమాజంలో చోటు లేదన్నారు. కేటీఆర్‌ గురువారం హెచ్‌ఐసీసీలో జరిగే నాస్కామ్‌ జీసీసీ సదస్సులో పాల్గొననున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని