భాజపా జాతీయ నేతలను ఊరూరా నిలదీయండి

నియోజకవర్గాల్లో తిరుగుతామని వస్తున్న భాజపా జాతీయ నేతలను ప్రజలు ఊరూరా నిలదీయాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు.  తెలంగాణకు మోదీ ఏమిచ్చారో, కేంద్రం రాష్ట్రానికి చేసిన ఒక్క మంచిపనైనా ఉందేమో

Published : 01 Jul 2022 05:44 IST

 రాష్ట్రానికి ప్రధాని ఏం చేశారని  తెరాస శ్రేణులు ప్రశ్నించండి

మోదీ క్రూరమైన నియంత: కేటీఆర్‌

కల్వకుర్తి కాంగ్రెస్‌, భాజపా నేతలు తెరాసలో చేరిక

ఈనాడు, హైదరాబాద్‌: నియోజకవర్గాల్లో తిరుగుతామని వస్తున్న భాజపా జాతీయ నేతలను ప్రజలు ఊరూరా నిలదీయాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు.  తెలంగాణకు మోదీ ఏమిచ్చారో, కేంద్రం రాష్ట్రానికి చేసిన ఒక్క మంచిపనైనా ఉందేమో చెప్పాలని ప్రశ్నించాలన్నారు. కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్‌, భాజపా నాయకులు గురువారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభివృద్ధి అంటే ఏమిటో ఇక్కడ నేర్చుకొని వెళ్లాలని అన్నారు. ‘‘హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు భాజపా సర్కస్‌ జరగబోతోంది. పచ్చి అబద్ధాలతో నాలుగు బొమ్మలు పెట్టి ఆగం చేసేందుకు ప్రధాని సహా కేంద్రమంత్రులు, నాయకులు వస్తున్నారు. వారు ఇక్కడి బిర్యాని తిని, ఇరానీచాయ్‌ తాగి మాయమవుతారు. రక్తమాంసాలు ధారపోసి తెలంగాణ పన్నుల రూపంలో చెల్లిస్తోంటే కేంద్రం ఆ సొమ్ముతో కులుకుతోంది. భాజపా నాయకులకు ఆ విశ్వాసం ఉంటే  ఇక్కడి ప్రజలకు సెల్యూట్‌ కొట్టి వెళ్లాలి.

మోదీని సాగనంపే సమయం వచ్చింది

భాజపా నేతలు కేసీఆర్‌ నియంత అని మాట్లాడుతున్నారు. ఆయనే అలాంటి వారైతే మీ అందరినీ జైలులో వేసేవారు. మోదీ క్రూర నియంత. ఆయనకు  బై బై చెప్పాల్సిన సమయం వచ్చింది.  రేవంత్‌ అనే చిలుక మనదే కానీ పలుకు పరాయిది. యాభై ఏళ్లు రాష్ట్రాన్ని నడిపిందే కాంగ్రెస్‌.. ఇప్పుడు ఒక్క ఛాన్స్‌ అనడానికి సిగ్గుండాలి. ఆ పార్టీవి నీతిలేని మాటలు’’ అని కేటీఆర్‌ అన్నారు.

కొత్త.. పాత నీరు కలిస్తేనే పార్టీకి బలం

తెరాస అంటే తిరుగు లేని రాజకీయ శక్తి అని, కొత్త నీరు పాత నీరు కలిసి పనిచేస్తేనే పార్టీకి బలమని కేటీఆర్‌ అన్నారు. కల్వకుర్తిలో 38వేల ఎకరాలకు నీరు ఇప్పించే బాధ్యత తనదని అన్నారు. అక్కడ తెరాసకు తిరుగులేదని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్‌, మెతుకు ఆనంద్‌, ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ పోతుగంటి రాములు, ఎస్సీ కార్పొరేషన్‌, ఛైర్మన్‌ బండా శ్రీనివాస్‌ ఇతర నేతలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని