Updated : 02 Jul 2022 06:51 IST

4న ఏక్‌నాథ్‌ శిందే బలపరీక్ష

రేపటి నుంచి రెండు రోజులు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
 స్పీకర్‌ పదవికి భాజపా ఎమ్మెల్యే నామినేషన్‌

ముంబయి: శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలో ఏర్పడిన మహారాష్ట్ర ప్రభుత్వం బల నిరూపణకు సిద్ధమవుతోంది. దీని కోసం రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు ఈ నెల 3న ప్రారంభం కానున్నాయి. విశ్వాస పరీక్షకు సంబంధించిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి శిందే 4న సభ ముందుంచుతారని విధాన్‌భవన్‌ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఈ సమావేశంలోనే అసెంబ్లీ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు.సభాపతి పదవికి శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆ పదవికి భాజపా ఎమ్మెల్యే రాహుల్‌ నర్వేకర్‌ శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. శిందే సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. గురువారం జరిగిన తొలి కేబినెట్‌ భేటీలో జులై 2, 3 తేదీల్లో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.ఈ తేదీల్లో మార్పులు జరిగాయి. తాజా షెడ్యూల్‌ ప్రకారం 3న ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి. సభాపతి పదవికి ఓటింగ్‌ అనివార్యమైతే అదే రోజు ఎన్నిక జరుగుతుంది. 4న శిందే ప్రభుత్వ బలపరీక్ష ఉంటుంది. ఎన్సీపీ నేత ధనంజయ్‌ ముండే.. ఉపముఖ్యమంత్రి, భాజపా నేత ఫడణవీస్‌ను శుక్రవారం రాత్రి కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వంలో సామాజిక న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ధనంజయ్‌..దివంగత భాజపా సీనియర్‌ నేత గోపీనాథ్‌ ముండే సమీప బంధువు. ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌కు అత్యంత సన్నిహితుడు.

భాజపా వేడుకలకు ఫడణవీస్‌ దూరం

మహారాష్ట్రలో మళ్లీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా భాజపా శ్రేణులు ముంబయిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం వేడుకలు జరుపుకొన్నాయి. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ఫడణవీస్‌ పాల్గొనలేదు. హైదరాబాద్‌లో జరిగే భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా ఆయన హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. అసెంబ్లీ ప్రత్యేక భేటీకి సంబంధించిన విషయాల్లో తీరిక లేకుండా ఉన్నందునే ఫడణవీస్‌ పార్టీ సమావేశంలో పాల్గొనలేకపోతున్నారని ఆయన సన్నిహితుడు ఒకరు తెలిపారు.

సుప్రీంకోర్టులో ఠాక్రే వర్గం పిటిషన్‌

ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శిందే సహా కొంతమంది రెబెల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత విషయం తేలే వరకు వారిని అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా సస్పెండ్‌ చేయాలని కోరుతూ శివసేన చీఫ్‌ విప్‌ సునీల్‌ ప్రభు పిటిషన్‌ దాఖలు చేశారు. రెబెల్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌తో పాటు 11న ఈ కేసు విచారణను చేపడతామని జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జె.బి.పర్దివాలా ధర్మాసనం పేర్కొంది.


‘శివసేన నేత’ పదవి నుంచి శిందే తొలగింపు
ఉద్ధవ్‌ ఠాక్రే లేఖ

 

శిందేను ‘శివసేన నేత’ పదవి నుంచి పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే శుక్రవారం తొలగించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను ఆయనను తొలగిస్తున్నట్లు పేర్కొంటూ ఠాక్రే లేఖ రాశారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. శిందే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తేదీ (జూన్‌ 30)తోనే లేఖను పంపారు.


అప్పుడే అంగీకరించి ఉంటే ఇలా అయ్యేదా: ఉద్ధవ్‌ ఠాక్రే

మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వ పతనం, ఏక్‌నాథ్‌ శిందే సారథ్యంలో కొత్త సర్కారు ఏర్పాటు నేపథ్యంలో మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవిని భాజపా, శివసేన చెరో రెండున్నరేళ్లు పంచుకుందామన్న ఒప్పందం అమలుకు 2019లోనే అమిత్‌ షా అంగీకరించి ఉంటే.. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తేదా అని ఠాక్రే ప్రశ్నించారు. సీఎం పదవిని చేపట్టే వంతు ఇప్పుడు భాజపాకే వచ్చేదన్నారు. మెట్రో కార్‌ షెడ్‌ను ముంబయిలోని కంజూర్‌మార్గ్‌ నుంచి ఆరే కాలనీకి తరలించాలన్న ఏక్‌నాథ్‌ సర్కారు నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. శిందే నిర్వహించిన తొలి కేబినెట్‌ భేటీలో.. ఆరే కాలనీలోనే మెట్రో కార్‌ షెడ్‌ను నిర్మించే విషయమై ప్రతిపాదనలు రూపొందించాలని ఉపముఖ్యమంత్రి ఫడణవీస్‌ అధికారులను ఆదేశించారు. ఈ వివాదం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉందని వారు వివరించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని