మోటార్లకు మీటర్లు బిగిస్తే ఉద్యమం

‘వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడమంటే రైతు మెడకు ఉరితాడు బిగించడమే. గ్రామ స్థాయి నుంచి రైతులు సంఘటితమై ప్రభుత్వ విధానంపై

Published : 03 Jul 2022 05:35 IST

జగ్గంపేట సభలో తెదేపా నేతల హెచ్చరిక

ఈనాడు డిజిటల్‌- రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే- జగ్గంపేట: ‘వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడమంటే రైతు మెడకు ఉరితాడు బిగించడమే. గ్రామ స్థాయి నుంచి రైతులు సంఘటితమై ప్రభుత్వ విధానంపై ఉద్యమించాలి. తెదేపా ఎప్పుడూ కర్షకుల వెంటే ఉంటుంది. గతంలో ఉన్న ఉచిత విద్యుత్తు విధానాన్ని మళ్లీ కొనసాగించాలి’ అని తెదేపా నాయకులు డిమాండ్‌ చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో శనివారం తెదేపా ఆధ్వర్యంలో రైతు పోరు బహిరంగసభ నిర్వహించారు. సభకు తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పార్టీ నాయకులు హాజరయ్యారు. వైకాపా విధానాలతో వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధి తీవ్రంగా దెబ్బతిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. వ్యవసాయ వృద్ధి రేటు 5 శాతం పడిపోయిందని తెలిపారు. తెదేపా పాలనలో 33 శాతం ఆక్వా వృద్ధి రేటు ఉంటే ప్రస్తుతం 14.8 శాతానికి పడిపోయిందన్నారు. లక్షలాది రైతులకు తెదేపా ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తు ఇచ్చిందని.. ప్రస్తుతం మోటార్లకు మీటర్లు బిగించాలని చేస్తున్న ప్రయత్నాలను రైతులు తిప్పికొట్టాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలులో 17 వేల మంది రైతులకు అన్యాయం జరిగిందని వైకాపా ఎంపీ బోసు వెల్లడించినా.. కనీసం విచారించలేదని విమర్శించారు. దళారుల ప్రమేయంతో రైతు క్వింటాల్‌కు రూ.213 కోల్పోతున్నారని చెప్పారు. ప్రభుత్వం నిర్వహిస్తున్నది ధాన్యం కోనుగోలు కేంద్రాలు కావని, బూటకపు కేంద్రాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే చినరాజప్ప విమర్శించారు. పంట అమ్మిన 6 నెలలకూ రైతులకు నగదు చెల్లించటం లేదని వివరించారు. ధాన్యం బకాయిలను 21 రోజుల్లో చెల్లిస్తామని చెబుతున్నా.. 3 నెలలు గడిచినా జమ కావడం లేదని మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ విమర్శించారు. మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, జవహర్‌, పీతల సుజాత, బండారు సత్యనారాయణమూర్తి, గొల్లపల్లి సూర్యారావు, చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, రెడ్డి సుబ్రహ్మణ్యం, కూన రవికుమార్‌, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని