చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి: ఆర్‌.కృష్ణయ్య

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో వెనుకబడిన తరగతులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. కులగణన, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ

Published : 10 Aug 2022 05:22 IST

ఈనాడు, దిల్లీ: పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో వెనుకబడిన తరగతులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. కులగణన, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు డిమాండ్‌తో సంఘం ఆధ్వర్యంలో జంతర్‌మంతర్‌లో మంగళవారం భారీ ప్రదర్శన చేపట్టారు. అనంతరం నిరసన దీక్ష కొనసాగించారు. కృష్ణయ్య మాట్లాడుతూ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో బీసీలకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. దీక్షకు ఏపీ ఎంపీలు భరత్‌, అనురాధ, బీద మస్తాన్‌రావు, మాజీ ఎంపీ వీహెచ్‌ తదితరులు సంఘీభావం ప్రకటించారు. దీక్షలో బీసీ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, నాయకులు లాల్‌ కృష్ణ, అల్లంపల్లి రామకోటి, వెంకటేష్‌, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా పాపన్న గౌడ్‌ జయంతి..

సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతి ఉత్సవాలను తెలంగాణ భవన్‌లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పలువురు ఎంపీలు పాల్గొని పాపన్న చిత్రపటానికి నివాళులర్పించారు.

మంత్రుల లెక్క కాదు బీసీల జనాభా లెక్కలు కావాలి: జాజుల

దేశవ్యాప్తంగా బీసీల గణన చేపట్టాలని కోరుతుంటే కేంద్రంలోని పెద్దలు కేంద్ర క్యాబినెట్‌లో 27 మంది బీసీలకు అవకాశం ఇచ్చామని చెబుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ విమర్శించారు. తమకు కావల్సింది కేంద్ర మంత్రుల లెక్కలు కాదని..బీసీల జనాభా లెక్కలన్నారు. బీసీ కులగణనను డిమాండ్‌ చేస్తూ జంతర్‌మంతర్‌లో మంగళవారం మహాధర్నా నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని