Updated : 12 Aug 2022 06:29 IST

అన్నీ ఆలోచించే అభ్యర్థి ఎంపిక

టికెట్‌ ఎవరికిచ్చినా కష్టపడి పనిచేయాలి

ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: మునుగోడులో రాజకీయ పరిస్థితులపై ఏడాది కాలంగా సర్వేలు జరుగుతున్నాయని, పూర్తి అవగాహనతో ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని అభ్యర్థిని ఎంపిక చేస్తామని తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ నేతలకు తెలిపారు. మునుగోడును తెరాస ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోందని, టికెట్‌ను ఎవరికి ఇచ్చినా అందరూ కష్టపడి పనిచేయాలని, ఉపఎన్నికలో గులాబీ జెండా ఎగురవేయాలని స్పష్టం చేశారు. ఉపఎన్నిక అంశంపై గురువారం ఉదయం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో సమావేశమయ్యారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్‌, జిల్లా ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్‌, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. ‘‘మునుగోడులో 2018లోనే గెలవాల్సి ఉన్నా.. కొంతమంది సరిగా పనిచేయకపోవడంతో ఓటమి సంభవించింది. ఈసారి అలాంటివి ఉండవు. గత ఎన్నికల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని వ్యూహరచన చేస్తున్నాం. కచ్చితంగా గెలిచే అభ్యర్థి ఎవరో అంచనా వేస్తున్నాం. నియోజకవర్గంలో అన్ని రకాలుగా బలంగా ఉండడంతోపాటు తగిన గుర్తింపుతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అభ్యర్థి ఉంటారు. తెరాస క్రమశిక్షణ గల పార్టీ. ఎన్నికల సమయంలో నేతలు స్వప్రయోజనాలు ఆశించకుండా పనిచేయాలి. పార్టీ కోణంలో ఆలోచిస్తే గుర్తింపు ఉంటుంది’’ అని సీఎం వారికి వివరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా వివిధ సర్వేల ఫలితాలను వారికివెల్లడించారు. మునుగోడు పరిధి జడ్పీటీసీలు, ఎంపీపీలు, పురపాలక ఛైర్మన్లను ఒకటీరెండు రోజుల్లో తన వద్దకు తీసుకురావాలని మంత్రి జగదీశ్‌రెడ్డికి కేసీఆర్‌ సూచించారు.


కామన్వెల్త్‌ క్రీడల్లో భారతదేశం సాధించిన మొత్తం పతకాల్లో, తెలంగాణ 2వ స్థానంలో నిలవడం గర్వకారణమని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ సందర్భంగా క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ను ఆయన అభినందించారు. మంత్రిమండలి సమావేశం ముగిశాక శ్రీనివాస్‌గౌడ్‌, సాట్స్‌ ఛైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డిలు సీఎంను కలిశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 22న హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో కామన్వెల్త్‌ క్రీడల విజేతలను సత్కరిస్తామని సీఎం తెలిపారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని