ఆశావహులతో చర్చలు..అసమ్మతి లేకుండా చర్యలు

మునుగోడు ఉప ఎన్నిక కార్యాచరణపై కాంగ్రెస్‌ కసరత్తు ముమ్మరం చేసింది. పాదయాత్రలు, మండలాల వారీగా సమీక్షలతో పాటు 75 రోజుల ప్రణాళిక విజయవంతానికి ప్రణాళికలు రచిస్తోంది. ప్రధానంగా టికెట్‌ ఎవరికి వచ్చినా

Published : 13 Aug 2022 04:59 IST

వారికి పార్టీ కార్యక్రమాల అమలు బాధ్యత అప్పగించే యోచన
మునుగోడుపై కాంగ్రెస్‌ కసరత్తు

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: మునుగోడు ఉప ఎన్నిక కార్యాచరణపై కాంగ్రెస్‌ కసరత్తు ముమ్మరం చేసింది. పాదయాత్రలు, మండలాల వారీగా సమీక్షలతో పాటు 75 రోజుల ప్రణాళిక విజయవంతానికి ప్రణాళికలు రచిస్తోంది. ప్రధానంగా టికెట్‌ ఎవరికి వచ్చినా ఆశావహులు నిరసన గళం వినిపించకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఆశావహులకు ఈ కార్యక్రమాల్లో బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. ఒక్కొక్కరిని పిలిచి టికెట్‌ కేటాయింపు ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది? అధిష్ఠానం ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది? సర్వేలు, తదితర అంశాలను వివరించే ప్రయత్నం చేస్తోంది. టికెట్‌ రాకుంటే నిరాశకు గురికాకుండా, తీవ్రనిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే వారిని మానసికంగా సిద్ధంచేసే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు బోసురాజు, నదీమ్‌ జావెద్‌, రోహిత్‌ చౌదరి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి, పీసీసీ ప్రచారకమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ తదితరులు శుక్రవారం గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. 13న రేవంత్‌రెడ్డి, ముఖ్యనేతల పాదయాత్ర, 16 నుంచి చేపట్టే మండలాల వారీ సమీక్షలపై చర్చించారు. పాదయాత్రల బాధ్యతలు ఆశావహులకు అప్పగించాలని నిర్ణయించారు. మునుగోడు టికెట్‌ ఆశిస్తున్న పాల్వాయి స్రవంతిని గాంధీభవన్‌కు పిలిచి మాట్లాడారు. రేవంత్‌రెడ్డి పాదయాత్రతో పాటు ఇతర కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని, పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో కీలకపాత్ర పోషించాలని ఆమెకు సూచించినట్లు తెలిసింది. సర్వే ఆధారంగానే టికెట్‌ వస్తుందని, ఎవరికి వచ్చినా గెలుపుకోసం కష్టపడి పని చేయాలని సూచించినట్లు సమాచారం. టికెట్‌ రాకుంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పినట్లు తెలిసింది. తనకు టికెట్‌ వస్తే తప్పకుండా గెలుస్తానని, తన తండ్రి నియోజకవర్గానికి చేసిన సేవలు తన విజయానికి దోహదపడతాయని ఈ సందర్భంగా స్రవంతి అన్నట్లు తెలిసింది. ఇప్పటికే మూడు సార్లు టికెట్‌ విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆమె ప్రస్తావించినట్లు సమాచారం. ఇదిలాఉండగా అమిత్‌షా సభ తర్వాత అదే తరహాలో కాంగ్రెస్‌ సభ పెడితే ఎలా ఉంటుందని చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విషయం ప్రస్తావనకు వచ్చింది. ఆయనకు ఏదోలా సర్దిచెప్పి కలుపుకొని పోవాలని, తద్వారా మునుగోడులో పార్టీకి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తపడాలని బోసురాజుకు నాయకులు సూచించినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని