కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి రేవంత్‌రెడ్డి క్షమాపణ

కాంగ్రెస్‌లో మునుగోడు ఉపఎన్నిక వేడి కొనసాగుతూనే ఉంది.  ఉప ఎన్నిక  కంటే నాయకుల మధ్య విభేదాలు పరిష్కరించడమే అధిష్ఠానానికి ప్రధాన సమస్యగా మారింది. ఇటీవల మునుగోడు నియోజకవర్గం చండూరులో జరిగిన సభలో

Published : 14 Aug 2022 06:06 IST

మన్నించాలని మరోసారి కోరిన అద్దంకి దయాకర్‌

అయినా పట్టువీడని వెంకట్‌రెడ్డి

నష్ట నివారణపై కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌లో మునుగోడు ఉపఎన్నిక వేడి కొనసాగుతూనే ఉంది.  ఉప ఎన్నిక  కంటే నాయకుల మధ్య విభేదాలు పరిష్కరించడమే అధిష్ఠానానికి ప్రధాన సమస్యగా మారింది. ఇటీవల మునుగోడు నియోజకవర్గం చండూరులో జరిగిన సభలో ఎంపీ, పీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఉద్దేశించి ఆ పార్టీ నాయకుడు అద్దంకి దయాకర్‌ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శనివారం క్షమాపణలు చెప్పారు.. అయితే దీంతో కోమటిరెడ్డి సంతృప్తి చెందలేదు. దీనిని బట్టి రేవంత్‌ క్షమాపణతో సమస్య పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు.

చండూరు సభలో అద్దంకి దయాకర్‌ వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకట్‌రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడి సమక్షంలో సంఘటన జరిగినందున ఆయన క్షమాపణలు చెప్పాలని, దయాకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. తనను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, మునుగోడు ఉపఎన్నిక కార్యక్రమాలపై తనకు సమాచారం ఇవ్వడం లేదంటూ పిలవని పేరంటానికి వెళ్లను, ప్రచారం చేయనని స్పష్టం చేశారు. వెంకట్‌రెడ్డి డిమాండ్‌పై రేవంత్‌రెడ్డి స్పందించారు. ‘దయాకర్‌ వాడిన పరుష పదజాలంతో మనస్తాపానికి గురయ్యాను. బేషరతుగా వెంకట్‌రెడ్డికి క్షమాపణలు చెప్తున్నా. ఇలాంటి భాష వాడటం ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన వ్యక్తి పట్ల ఇలా మాట్లాడటం సరికాదు. దయాకర్‌ మీద చర్యలపై మరోసారి పరిశీలించాలని క్రమశిక్షణ కమిటీకి సూచిస్తున్నా’ అంటూ రేవంత్‌రెడ్డి శనివారం ఒక వీడియో విడుదల చేశారు.

* రేవంత్‌రెడ్డి, దయాకర్‌లు బహిరంగంగా క్షమాపణ చెప్పినప్పటికీ వెంకట్‌రెడ్డి సంతృప్తి చెందలేదు. ‘రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పడం సంతోషం,  దయాకర్‌ను పార్టీ నుంచి శాశ్వతంగా సస్పెండ్‌ చేస్తేనే ఆయన క్షమాపణ గురించి ఆలోచిస్తా’నని వెంకట్‌రెడ్డి స్పష్టంచేశారు. 

* అద్దంకి దయాకర్‌ సైతం శనివారం మరోసారి వెంకట్‌రెడ్డికి క్షమాపణ చెపుతూ ఒక వీడియో విడుదల చేశారు. పెద్దమనసుతో క్షమించి పార్టీ కోసం పనిచేయాలని కోరారు. రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పినందున వెంకట్‌రెడ్డి మునుగోడు ప్రచారంలో పాల్గొనాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు కోరారు.

నష్ట నివారణపై కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టి

కీలకమైన మునుగోడు ఉపఎన్నిక వేళ నేతల మధ్య అంతర్గతపోరు పార్టీకి నష్టం కలగజేస్తుందని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో నష్ట నివారణపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అధిష్ఠానం పెద్దల సూచన మేరకే రేవంత్‌రెడ్డి  క్షమాపణ చెప్పినట్లు తెలిసింది. వెంకట్‌రెడ్డితో ఏఐసీసీ పెద్దలు మాట్లాడుతున్నారని, ప్రచారంలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారని పీసీసీ ముఖ్య నేత ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.  ఉపఎన్నిక తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉందని ఆ నాయకుడు పేర్కొన్నారు.


నేను కాంగ్రెస్‌లో హోంగార్డును!

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన హోంగార్డు వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేపుతున్నాయి. దీనిపై ఇప్పటికే వెంకట్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నేను, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి, శ్రీధర్‌బాబు..ఇలా అందరం హోంగార్డులం, ఆయన(రేవంత్‌) ఐపీఎస్‌..అని ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన ట్విటర్‌ ప్రొఫైల్‌లోనూ ఇదే విషయమై మార్పులు చేయడం పార్టీలో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నాలుగు సార్లు  ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, ప్రస్తుతం ఎంపీగా..గత 3 దశాబ్దాలుగా హోంగార్డుగా కాంగ్రెస్‌లో పని చేస్తున్నానని పేర్కొన్నారు. అయితే సాయంత్రానికి ‘హోంగార్డు’ వాక్యాన్ని తొలగించారు. కొందరు ముఖ్య నాయకుల సూచనతో ఆయన  ఆ వాక్యాన్ని తొలగించినట్లు తెలిసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని