Published : 17 Aug 2022 05:49 IST

బాధితులకు రూ. 10 వేలు అందలేదు: భట్టి

వరద ప్రాంతాల్లో సీఎల్పీ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు

భద్రాచలం, బూర్గంపాడు, న్యూస్‌టుడే: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితుల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన తమను అడ్డుకోవడం అప్రజాస్వామికమని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీపై నిషేధం ఏమీ లేదని, తాము ఉగ్రవాదులం కాదని అన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ తదితరులతో కూడిన సీఎల్పీ బృందం మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం మండలాల్లో పర్యటించేందుకు వచ్చింది. ముందుగా భద్రాచలం కరకట్ట, ముంపు కాలనీలను పరిశీలించింది. అనంతరం దుమ్ముగూడెం మండలానికి వెళ్తుండగా ఈ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మరో దారిలో వీరు దుమ్ముగూడెం మండలానికి చేరుకోగా అక్కడ పోలీసులు అడ్డుకొని భద్రాచలం పంపించారు. ఈ నేపథ్యంలో భద్రాచలంలో విలేకర్ల సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. గోదావరి వరద బాధితులకు ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.10 వేల పరిహారం అందలేదని, కొందరికి నిత్యావసర సరకులు కూడా ఇవ్వలేదని వెల్లడించారు.  మంగళవారం సాయంత్రం భద్రాచలం నుంచి సారపాకలోని సుందరయ్యనగర్‌ చేరుకున్న సీఎల్పీ బృందం సభ్యులు ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. అనంతరం అశ్వాపురం పర్యటనకు వెళ్లేందుకు బయల్దేరగా వారిని మణుగూరు అడ్డరోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా తదితరులు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రాత్రి 8.30కు పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఇల్లెందు తరలించారు. సీఎల్పీ బృందాన్ని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, పీసీసీ అధ్యక్షడు రేవంత్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌లు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.

ఉప ఎన్నికలో తెజస మద్దతు కోరిన కాంగ్రెస్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: మునుగోడు ఉప ఎన్నికలో మద్దతు ఇవ్వాలంటూ తెలంగాణ జన సమితి (తెజస)ని కాంగ్రెస్‌ కోరింది.  పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ నేతృత్వంలో బృందం మంగళవారం తెజస కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ నేతలు కోదండరాం, విశ్వేశ్వరరావులను కలిసింది. పార్టీలో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని కోదండరాం చెప్పినట్లు  మహేష్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని