భాజపాలోకి చౌటుప్పల్‌ ఎంపీపీ

మునుగోడు రాజకీయం రోజురోజుకూ ఆసక్తి రేపుతోంది. ఒకపక్క అధికార తెరాస... కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులను ఆపరేషన్‌ ఆకర్ష్‌ పేరుతో పార్టీలో చేర్చుకుంటుండగా... తాజాగా నియోజకవర్గంలో కీలకమైన చౌటుప్పల్‌ మండల పరిషత్‌ అధ్యక్షుడు

Updated : 17 Aug 2022 06:21 IST

ఈనాడు, నల్గొండ: మునుగోడు రాజకీయం రోజురోజుకూ ఆసక్తి రేపుతోంది. ఒకపక్క అధికార తెరాస... కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులను ఆపరేషన్‌ ఆకర్ష్‌ పేరుతో పార్టీలో చేర్చుకుంటుండగా... తాజాగా నియోజకవర్గంలో కీలకమైన చౌటుప్పల్‌ మండల పరిషత్‌ అధ్యక్షుడు (ఎంపీపీ) తాడూరి వెంకట్‌రెడ్డి తెరాసకు రాజీనామా చేసి మంగళవారం హైదరాబాద్‌లోని మాజీ మంత్రి ఈటల నివాసంలో భాజపాలో చేరారు. ఆయనతో పాటు చౌటుప్పల్‌ జడ్పీటీసీ మాజీ సభ్యుడు బుచ్చిరెడ్డి, పలువురు నేతలు భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల తెరాస అసమ్మతి నేతలంతా మంత్రి జగదీశ్‌రెడ్డితో సమావేశమైన మరుసటి రోజే వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు సమావేశమై కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టిక్కెట్‌ ఇవ్వొద్దని తీర్మానించారు. కాగా మరికొంతమంది ప్రజాప్రతినిధులు భాజపా నేతలతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. భాజపాలో చేరబోతున్నానన్న సమాచారంతో మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల  తనపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని  వెంకట్‌రెడ్డి ఆరోపించారు.  సోమవారం అర్ధరాత్రి తనను అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చారని, మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశాలతోనే ఇదంతా జరుగుతోందన్నారు. ఆయన విధానాలు నచ్చకే భాజపాలో చేరుతున్నట్లు చెప్పారు.

ఎంపీపీ ఇంటికి అర్ధరాత్రి మఫ్టీలో పోలీసుల రాక

ఎల్బీనగర్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ మన్సూరాబాద్‌లో ఉంటున్న చౌటుప్పల్‌ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి ఇంటికి సోమవారం అర్ధరాత్రి సివిల్‌ డ్రస్‌లో పోలీసులు వచ్చి హల్‌చల్‌ చేయడంతో భాజపా నాయకులు అక్కడికి చేరుకున్నారు. స్థానికులు, ఆ పార్టీ నాయకులు, వెంకట్‌రెడ్డి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఇంతకాలం తెరాసలో కొనసాగుతున్న వెంకట్‌రెడ్డి మన్సూరాబాద్‌లోని తంగ్రిళ్ల అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో కొందరు సివిల్‌ డ్రస్సులో వారి ఇంటికి వచ్చి తాము పోలీసులమని, వెంకట్‌రెడ్డితో మాట్లాడాలని కుటుంబసభ్యులను కోరారు. ఆయన ఇంట్లో లేరని, రాత్రి సమయంలో ఇలా ఇంటికి రావడం ఏమిటని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. ఇదే విషయాన్ని స్థానికంగా ఉన్న భాజపా నాయకులకు సమాచారం ఇవ్వడంతో పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి  అక్కడికి చేరుకున్నారు. అర్ధరాత్రి ఇలా రావాల్సిన అవసరం ఏమిటని పోలీసులను ఆయన అడగడంతో... చౌటుప్పల్‌లో నమోదైన కేసులో మాట్లాడేందుకు వచ్చామంటూ, సరైన సమాధానం  ఇవ్వకుండానే వచ్చిన రెండు వాహనాలలో వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని