గడ్కరీ, చౌహాన్‌లకు ఉద్వాసన

భాజపాలో వ్యవస్థాగతంగా బుధవారం కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలిగా పేరుగాంచిన పార్లమెంటరీ బోర్డు నుంచి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌లను తప్పించారు. కొత్తగా ఆరుగురు నేతలకు అందులో చోటుకల్పించారు.

Published : 18 Aug 2022 06:37 IST

భాజపా పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించిన అధినాయకత్వం

కె.లక్ష్మణ్‌, యడియూరప్పకు కొత్తగా స్థానం

పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలోకి ఫడణవీస్‌

ఈనాడు, దిల్లీ: భాజపాలో వ్యవస్థాగతంగా బుధవారం కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలిగా పేరుగాంచిన పార్లమెంటరీ బోర్డు నుంచి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌లను తప్పించారు. కొత్తగా ఆరుగురు నేతలకు అందులో చోటుకల్పించారు. వారిలో తెలంగాణకు చెందిన సీనియర్‌ నేత కె.లక్ష్మణ్‌, కర్ణాటక మాజీ సీఎం బి.ఎస్‌.యడియూరప్ప తదితరులు ఉన్నారు. మరోవైపు- భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ)నీ కూడా పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా పునర్‌వ్యవస్థీకరించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ తదితరులను కొత్తగా కమిటీలోకి తీసుకున్నారు.

ఇప్పటివరకు భాజపా పార్లమెంటరీ బోర్డులో ఏడుగురు సభ్యులు ఉండగా.. పునర్‌వ్యవస్థీకరణతో ఆ సంఖ్య 11కు పెరిగింది. ఇన్నాళ్లూ బోర్డులో సభ్యులుగా ఉన్న నడ్డా, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌ యథాతథంగా కొనసాగనున్నారు. కొత్తగా లక్ష్మణ్‌, యడియూరప్పలతో పాటు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌, జాతీయ మైనార్టీ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ ఇక్బాల్‌సింగ్‌ లాల్‌పురా, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌ స్థానం నుంచి ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికైన కేంద్ర మాజీ మంత్రి సత్యనారాయణ్‌ జటియా, హరియాణాకు చెందిన మాజీ ఎంపీ సుధా యాదవ్‌లను అందులోకి తీసుకున్నారు. దీంతో- కమలదళంలో పార్లమెంటరీ బోర్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి సిక్కు వ్యక్తిగా లాల్‌పురా నిలిచారు. సుధా యాదవ్‌ భర్త కార్గిల్‌ యుద్ధంలో వీరమరణం పొందారు.

భాజపా మాజీ అధ్యక్షుడు, ఆరెస్సెస్‌తో సన్నిహిత సంబంధాలున్న గడ్కరీ (65)తో పాటు చౌహాన్‌ (63)ను పార్లమెంటరీ బోర్డు నుంచి పక్కనపెట్టడం.. పార్టీలో వారికి ప్రాధాన్యం తగ్గుతోందని చెప్పేందుకు సంకేతాలని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాజకీయాలు అధికారం కోసం ఆడే ఆటగా మారాయని ఇటీవల నాగ్‌పుర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గడ్కరీ పేర్కొన్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఒక్కోసారి తనకు అనిపిస్తోందని కూడా వ్యాఖ్యానించారు. 75 ఏళ్ల వయసు పైబడినవారికి కీలక పదవులు కట్టబెట్టకపోవడమన్నది భాజపాలో కొన్నేళ్లుగా అనధికార నియమంగా కొనసాగుతూ వస్తోంది. అయితే తాజాగా పార్లమెంటరీ బోర్డులో చోటుదక్కించుకున్న యడియూరప్ప, జటియాల వయసు 75 ఏళ్ల కంటే ఎక్కువే కావడం గమనార్హం.

సామాజిక సమీకరణాలతో..

పార్లమెంటరీ బోర్డులోకి కొత్తగా తీసుకున్న సభ్యుల్లో ఇద్దరు ఓబీసీలు కాగా.. ఎస్సీ, ఎస్టీ, సిక్కు వర్గాల నుంచి ఒక్కొక్కరు, అగ్రవర్ణ సామాజిక వర్గం నుంచి మరొకరు ఉన్నారు. వచ్చే ఏడాది కర్ణాటక, తెలంగాణల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యడియూరప్ప, లక్ష్మణ్‌లకు ప్రాతినిధ్యం కల్పించి, ఆ రాష్ట్రాల్లోని బలమైన సామాజికవర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. యడియూరప్ప, లక్ష్మణ్‌, జటియాలు వారి వారి రాష్ట్రాల్లో పార్టీని నిర్మించుకుంటూ వచ్చారని భాజపా పేర్కొంది. వారికి పార్లమెంటరీ బోర్డులో చోటుకల్పించడం ద్వారా- కష్టపడి పనిచేసేవారికి పార్టీ కచ్చితంగా గుర్తింపునిస్తుందని చాటినట్లయిందని పలువురు కమలనాథులు పేర్కొన్నారు. పునర్‌వ్యవస్థీకరణలో అధినాయకత్వం అన్ని వర్గాలు, ప్రాంతాలకు సముచిత ప్రాధాన్యం కల్పించిందని అభిప్రాయపడ్డారు. సుధా యాదవ్‌ ఎంపికతో.. మహిళలు, సాయుధ దళాల కుటుంబాలకు గుర్తింపునిచ్చినట్లయిందని వ్యాఖ్యానించారు.

* మరోవైపు- భాజపా సీఈసీ నుంచి కేంద్ర మాజీ మంత్రులు జువల్‌ ఓరమ్‌, షానవాజ్‌ హుస్సేన్‌లకు ఉద్వాసన పలికారు. ఫడణవీస్‌, భూపేందర్‌ యాదవ్‌లతో పాటు రాజస్థాన్‌కు చెందిన నేత ఓం మాథుర్‌, భాజపా మహిళా విభాగం అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్‌లను తాజాగా కమిటీలోకి తీసుకున్నారు. పార్లమెంటరీ బోర్డు సభ్యులందరూ  సీఈసీలో సభ్యులుగా ఉంటారు. ఆ బోర్డులో చోటు కోల్పోయిన గడ్కరీ, చౌహాన్‌.. సీఈసీకీ దూరమైనట్లే. భాజపా అధ్యక్షుడిగా నడ్డా 2020లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత బోర్డును పునర్‌వ్యవస్థీకరించడం ఇదే తొలిసారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని