పడి లేచిన కెరటాలు

‘ఓటములు..విజయానికి సోపానాలు’...ఓ ఆంగ్ల నానుడి చెప్పే ధైర్య వచనాలివి. గెలుపోటములు సముద్ర కెరటాల్లా పడి లేస్తుంటాయని కొందరు రాజకీయ నాయకుల ప్రస్థానం చూస్తే అర్థమవుతుంది. ఒకసారి గురి తప్పినా, పార్టీ అండదండలతో

Updated : 19 Aug 2022 09:19 IST

 ఓటముల తర్వాతా నిలిచి గెలిచిన నాయకులు

పార్టీల్లోనూ, పదవుల్లోనూ పెద్దపీట

భాజపా ఎంపీ లక్ష్మణ్‌ తాజా ఉదాహరణ

ఈనాడు - దిల్లీ

‘ఓటములు..విజయానికి సోపానాలు’...ఓ ఆంగ్ల నానుడి చెప్పే ధైర్య వచనాలివి. గెలుపోటములు సముద్ర కెరటాల్లా పడి లేస్తుంటాయని కొందరు రాజకీయ నాయకుల ప్రస్థానం చూస్తే అర్థమవుతుంది. ఒకసారి గురి తప్పినా, పార్టీ అండదండలతో ఉన్నతస్థాయికి ఎదిగిన నాయకులు భాజపా సహా పలు పార్టీల్లో కనిపిస్తారు. భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా నియమితులైన కె.లక్ష్మణ్‌ ఇందుకు తాజా ఉదాహరణ. ముషీరాబాద్‌ సిటింగ్‌ ఎమ్మెల్యేగా, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేయాలనుకున్న ఆయనకు టికెట్‌ లభించలేదు. కానీ ఆ ఎన్నికల్లో భాజపా తరఫున నలుగురు లోక్‌సభకు ఎన్నికవడంతో ఆ పార్టీకి ఊరట కలిగింది. ఈ క్రమంలోనే లక్ష్మణ్‌ను భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షునిగా నియమించింది. రెండు నెలల కిందటే ఆయనను ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు పంపింది. ఇంతలోనే.. పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మకమైన పార్లమెంటరీ, ఎన్నికల బోర్డుల్లో లక్ష్మణ్‌కు చోటు కల్పించింది.


ఇటీవలే ఉపరాష్ట్రపతి పదవీకాలం పూర్తిచేసుకున్న ఎం.వెంకయ్యనాయుడు తొలినాళ్లలో.. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచారు. మరోసారి ఆత్మకూరు నియోజకవర్గంలో ఓడిపోయారు. ఆ ఓటమి తర్వాతే ఆయన జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. ‘ఉదయగిరిలో ఓటమే నేను ఉప రాష్ట్రపతి వరకు వచ్చేందుకు దారితీసింది’ అంటూ ఇటీవల విలేకరుల వద్ద వ్యాఖ్యానించారు వెంకయ్యనాయుడు. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన వివిధ పార్టీలకు చెందిన ఏడుగురు అభ్యర్థులు.. కొద్ది నెలల్లోనే 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీలుగా గెలవడం, ఇతర పదవులూ చేపట్టడం ఆసక్తికరం.


ఒకరు కేంద్ర మంత్రి.. ఇద్దరు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా..

కిషన్‌రెడ్డి: 2004లో హిమాయత్‌నగర్‌, 2009, 2014 శాసనసభ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి గెలుపొందిన భాజపా నాయకుడు కిషన్‌రెడ్డి 2018 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి విజయం సాధించడం, పార్టీలో సీనియర్‌ కావడంతో ఆయనను కేంద్ర మంత్రి పదవి వరించింది.


రేవంత్‌రెడ్డి: జడ్పీటీసీ సభ్యునిగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా, కొడంగల్‌ నుంచి 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్‌రెడ్డి 2018 శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.  2019లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. చురుకైన వ్యవహారశైలితో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆశీస్సులు పొంది.. పీసీసీ అధ్యక్షునిగా నియమితులయ్యారు.


బండి సంజయ్‌: 2014, 2018 ఎన్నికల్లో భాజపా తరఫున అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో ఎంపీగా కరీంనగర్‌ నుంచి విజయం సాధించడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాకు దగ్గరై పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు.


నామా నాగేశ్వరరావు: ఖమ్మం అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా 2018లో పోటీ చేసి ఓడిపోయిన నామా నాగేశ్వరరావు తర్వాత తెరాసలో చేరారు. 2019లో ఖమ్మం ఎంపీగా పోటీ చేసి గెలిచి తెరాస లోక్‌సభాపక్ష నేతగా నియమితులయ్యారు.

* కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.2019లో భువనగిరి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. సోయం బాపురావు 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు.2014, 2018 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 2019లో ఆదిలాబాద్‌ ఎంపీగా గెలుపొందారు. బొర్లకుంట వెంకటేష్‌నేత సైతం 2018లో ఎమ్మెల్యేగా ఓటమిపాలై.. 2019లో పెద్దపల్లి నుంచి తెరాస తరఫున ఎంపీగా విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని