జింఖానా ఘటనపై విచారణ జరపాలి

ఆదివారం ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న టీ20 మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకం, వాటి కోసం ఇటీవల జింఖానా మైదానంలో చోటు చేసుకున్న ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని

Published : 25 Sep 2022 04:11 IST

పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ఆదివారం ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న టీ20 మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకం, వాటి కోసం ఇటీవల జింఖానా మైదానంలో చోటు చేసుకున్న ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. టికెట్ల విక్రయం విషయంలో హెచ్‌సీఏ, రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యాయని విమర్శించారు. ఈ రెండూ కలిసి క్రీడాకారులు, అభిమానుల మనోభావాలను, హైదరాబాద్‌ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు. ఎన్ని టికెట్లు విక్రయానికి పెట్టారు, ఎన్ని అమ్ముడుపోయాయి? అనే దానిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం అండదండల వల్లే ఈ తతంగమంతా జరిగిందని ఆరోపించారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌, క్రీడల శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పే మాటల్లో పొంతన లేదన్నారు.

టిక్కెట్ల విక్రయాలపై విచారణ చేయించండి: కూనంనేని

ఈనాడు, హైదరాబాద్‌: ఇండియా-ఆస్ట్రేలియా క్రికెట్‌ మ్యాచ్‌ నేపథ్యంలో టిక్కెట్ల విక్రయాల్లో జరిగిన అక్రమాలు, తొక్కిసలాట వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. క్రీడా సంస్థల్లో రాజకీయ జోక్యం, పార్టీల ప్రమేయం కారణంగానే అవినీతి అక్రమాలు జరుగుతున్నాయన్నారు. జాతీయ స్థాయి సంస్థల్లో ఇప్పటికే రాజకీయ నాయకులు అధ్యక్ష, కార్యదర్శులు అవుతున్నారని పేర్కొన్నారు. క్రీడల్లోని వ్యాపార కోణాన్ని వారికి అనుకూలంగా మలుచుకుని అవినీతికి పాల్పడుతున్నారని, దీనివల్ల ప్రతిభ గల క్రీడాకారులు, క్రీడాభిమానులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. హైదరాబాద్‌ ప్రతిష్ఠ పెంచడానికి హెచ్‌సీఏ, ప్రభుత్వం శ్రద్ధ చూపాలని, తొక్కిసలాటలో గాయపడిన వారికి ఉచితంగా వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కూనంనేని కోరారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని