వెంకట్‌రెడ్డి మునుగోడు వస్తే మా అవసరం లేదు

పీసీసీ పదవి కోసం కోమటిరెడ్డి సోదరులిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడ్డారని.. ఒకరు తర్వాత ఒకరు తన వద్దకు వచ్చి తనకే పదవి ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చారని మాజీ మంత్రి షబ్బీర్‌

Published : 29 Sep 2022 04:43 IST

అన్నదమ్ములిద్దరూ పీసీసీ పదవికి పోటీపడ్డారు

పదవి ఇవ్వాలంటూ నాపై ఒత్తిడి తెచ్చారు: కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ

చండూరు, న్యూస్‌టుడే: పీసీసీ పదవి కోసం కోమటిరెడ్డి సోదరులిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడ్డారని.. ఒకరు తర్వాత ఒకరు తన వద్దకు వచ్చి తనకే పదవి ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చారని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ చెప్పారు. నల్గొండ జిల్లా చండూరులో బుధవారం నిర్వహించిన పార్టీ మండల, పట్టణ బూత్‌ కమిటీ సభ్యులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నదమ్ములే ఓ తాటి మీదికి రాకపోతే ఇక వాళ్లు రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తారని ప్రశ్నించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి నల్గొండలో రాజకీయ జీవితం ఇచ్చింది తానేనన్న విషయం మరిచిపోయి తనపైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని తాము పార్టీ నుంచి వెళ్లమనలేదని, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మునుగోడు ప్రచారానికి రావాలని కోరారు. వెంకట్‌రెడ్డి వస్తే తాము ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదన్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో తనకు నోటీసు వచ్చిందని.. అవసరమైతే తన నాయకురాలితో జైలుకు వెళ్లాల్సి వస్తే తాను గర్వపడతానని పేర్కొన్నారు. అభివృద్ధి కోసం రాజీనామా చేశానంటున్న రాజగోపాల్‌రెడ్డి భాజపాలో గెలిస్తే మాత్రం ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయగలరని ప్రశ్నించారు. బంగారు తెలంగాణలో బంగారం, ఉద్యోగాలు, నిధులన్నీ సీఎం కేసీఆర్‌ ఇంటికే వెళ్లాయన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఈరవర్తి అనిల్‌, వంశీకృష్ణ తదితరులు ఉన్నారు.


భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా పెంచాలి: రేవంత్‌రెడ్డి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: భవన నిర్మాణ కార్మికుల ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలపై భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ప్రతినిధులు బుధవారం ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నిర్మాణ సమయంలో ప్రమాదంలో గాయపడితే రూ.5 లక్షల బీమాతో పాటు కోలుకునేవరకు నెలకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలన్నారు. కార్మికుల సంక్షేమ బోర్డు జారీ చేసిన గుర్తింపు కార్డు ఉండి 60 ఏళ్లు దాటిన వారికి నెలకు రూ.5 వేల చొప్పున పింఛన్‌ సదుపాయం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

* నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో అక్టోబరు 6న జరిగే అలయ్‌ బలయ్‌కు రావాలని కార్యక్రమ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ బండారు విజయలక్ష్మి బుధవారం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని