నాలుగు ఎకరాలు గ్రీన్‌బెల్ట్‌లో ఉన్నాయి: తెదేపా

విశాఖ దసపల్లా భూముల వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

Published : 01 Oct 2022 05:06 IST

విశాఖపట్నం(వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: విశాఖ దసపల్లా భూముల వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం తమకు కావాల్సిన వారికి రూ.2వేల కోట్ల విలువ చేసే భూములను కట్టబెడుతోందని ఆరోపించారు. గతంలో ఈ భూవ్యవహారంలో తెదేపా నేతల హస్తం ఉందని, సీబీఐతో విచారణ జరిపించాలని ప్రస్తుత మంత్రి అమర్‌నాథ్‌ డిమాండ్‌ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన తన ఆరోపణలకు కట్టుబడి సీబీఐ విచారణకు ఆదేశించి, భూ కుంభకోణం కారకులను వెల్లడించాలన్నారు. మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డిల హస్తం ఉందని ఆరోపించారు. దసపల్లా భూముల్లో నాలుగు ఎకరాలు గ్రీన్‌బెల్ట్‌లో ఉన్నాయని, వాటిని సైతం విక్రయిస్తున్నారన్నారు. గాజువాక కొండలపై ఉన్న భూములను కొండ బంజర్లుగా చెబుతున్నారని, దసపల్లా భూములను కొండ భూములుగా ఎందుకు పరిగణించడం లేదో స్పష్టం చేయాలన్నారు. తన భూములను సైతం 22ఎలో పెట్టారని, 20 ఏళ్లుగా తిరుగుతున్నా ఇంత వరకు మినహాయింపు ఇవ్వలేదని చెప్పారు. దసపల్లా భూములను అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ (పట్టణ భూగరిష్ఠ పరిమితి చట్టం) కింద స్వాధీనం చేసుకోవచ్చనే నిబంధన ఉన్నా, ఆ రకంగా చేయలేదని చెప్పారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద నిలబెట్టించారని తెలంగాణ మంత్రి హరీష్‌రావు చెప్పిన మాటలు నూరు శాతం వాస్తవమన్నారు. న్యాయవాది గిరిధర్‌ మాట్లాడుతూ గ్రౌండ్‌ రెంట్‌ పట్టా భూములు ప్రభుత్వానికే చెందుతాయని తెలిపారు. దసపల్లా భూముల వ్యవహారంలో అనేక నిబంధనలు ఉల్లంఘించారని, అవి ముమ్మాటికీ ప్రభుత్వ భూములేనని పేర్కొన్నారు. వాటిపై మరోసారి పరిశీలన చేసి స్వాధీనం చేసుకోవాలన్నారు. తెదేపా విశాఖ జిల్లా కమిటీ కార్యదర్శి పాశర్ల ప్రసాద్‌, దక్షిణ నియోజకవర్గ బాధ్యులు గండి బాబ్జీ, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని