జగన్‌ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలు నాశనం

జగన్‌ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు నాశనమయ్యాయని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థను జగన్‌రెడ్డి ప్రైవేటు సైన్యంగా మార్చుకొని ప్రతిపక్షాలపై దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు.

Published : 03 Oct 2022 05:51 IST

తెదేపా అధినేత చంద్రబాబు

ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పాదయాత్రకు పదేళ్లు

‘చంద్రదండు’ నేతృత్వంలో వేడుకలు

ఈనాడు డిజిటల్‌-అమరావతి, ఈనాడు-హైదరాబాద్‌: జగన్‌ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు నాశనమయ్యాయని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థను జగన్‌రెడ్డి ప్రైవేటు సైన్యంగా మార్చుకొని ప్రతిపక్షాలపై దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షనేతగా చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా చంద్రదండు ఆధ్వర్యంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి ఆదివారం చేరుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు కేకు కోసి నాటి పాదయాత్ర స్మృతులను గుర్తు చేసుకొన్నారు. ‘ఉమ్మడి రాష్ట్రాన్ని నాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆర్థికంగా, రాజకీయంగా ఛిన్నాభిన్నం చేయడంతో ప్రజలకు భరోసా ఇవ్వడానికి పాదయాత్ర చేశాను. నేడు ఏపీలో అంతకంటే దారుణ పరిస్థితులు ఉన్నాయి. శాంతిభద్రతలు కరవయ్యాయి. రాజధాని లేదు, కొత్త పరిశ్రమలు రావడం లేదు. ఎక్కడ చూసినా రౌడీయిజం, గూండాయిజం పేట్రేగిపోతున్నాయి. జగన్‌ను గద్దె దింపితే తప్ప రాష్ట్రం బాగుపడదు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు 63 ఏళ్ల వయసులో 2012లో గాంధీ జయంతి రోజున హిందూపురంలో పాదయాత్ర ప్రారంభించిన చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో 208 రోజుల పాటు 2,817 కి.మీ. నడిచారు. ఏటా ఈ రోజున చంద్రదండు నేతృత్వంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు, రాష్ట్ర మాంసాభివృద్థి సంస్థ మాజీ ఛైర్మన్‌ చంద్రదండు ప్రకాశ్‌, తెదేపా నాయకులు కోటేశ్వరరావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని