గాంధీ భావజాలాన్ని అవమానిస్తున్న ప్రభుత్వం

గత ఎనిమిదేళ్లుగా దేశంలో గాంధీ మార్గానికి భిన్నమైన విధానాలు అమలవుతున్నాయని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం విభజన, జాతి విద్వేషాలతో

Published : 03 Oct 2022 03:08 IST

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపణ

ఈనాడు, బెంగళూరు: గత ఎనిమిదేళ్లుగా దేశంలో గాంధీ మార్గానికి భిన్నమైన విధానాలు అమలవుతున్నాయని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం విభజన, జాతి విద్వేషాలతో గాంధీ భావజాలాన్ని అవమానపరుస్తోందని అన్నారు. మహాత్మాగాంధీ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడం.. ఆయన అడుగుజాడల్లో నడవడం అంత సులభం కాదని పేర్కొన్నారు. కర్ణాటకలో సాగుతున్న భారత్‌ జోడో యాత్ర సందర్భంగా ఆయన వర్షంలోనే ప్రసంగించారు. గాంధీ మార్గాలైన అహింస, ఐక్యత, సామాజిక న్యాయాన్ని అనుసరిస్తూ ఈ యాత్రను కొనసాగిస్తున్నామని చెప్పారు. ‘మహాత్ముడు బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. మనం.. గాంధీజీని హత్య చేసిన వారి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల హక్కులు, గ్రామాల్లో పంచాయతీరాజ్‌ వ్యవస్థను పరిరక్షించటమే ఈ యాత్ర లక్ష్యమన్నారు. ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా రాహుల్‌గాంధీ.. మైసూరులోని బదనవాళ్‌ ఖాదీ గ్రామ్‌ కేంద్రంలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇదే గ్రామంలో రెండు సముదాయాల మధ్య కొనసాగుతున్న వైరాన్ని తొలగించేందుకు సామూహిక భోజనం, మూసి వేసిన రహదారుల్లో స్వచ్ఛత కార్యక్రమాలను నిర్వహించారు.

6న రాహుల్‌ యాత్రలో సోనియా
దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ నెల 6న భారత్‌ జోడో యాత్రలో పాల్గొననున్నారు. కర్ణాటకలో కొనసాగే యాత్రకు ఆమె హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. వైద్యం నిమిత్తం ఆమె విదేశాలకు వెళ్లిన సమయంలో రాహుల్‌ యాత్ర మొదలైన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని