దసపల్లా భూములను పరిరక్షించండి

విశాఖపట్నంలో అన్యాక్రాంతమవుతున్న దసపల్లా భూములను కాపాడి, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సీఎం జగన్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు.

Updated : 05 Oct 2022 05:33 IST

సీఎం జగన్‌కు భాజపా లేఖ

ఈనాడు, అమరావతి: విశాఖపట్నంలో అన్యాక్రాంతమవుతున్న దసపల్లా భూములను కాపాడి, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సీఎం జగన్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. ‘విశాఖపట్నం నడిబొడ్డున ఉన్న వివాదాస్పద దసపల్లా భూములను కొందరు బిల్డర్లకు అప్పగించడానికి రంగం సిద్ధమైంది. దీని వెనుక అధికార పార్టీ నాయకులు, వారి బంధువర్గాలకు ప్రయోజనం చేకూరేలా రూ.కోట్ల కుంభకోణం దాగి ఉందని వార్తలు వచ్చాయి. 2016లో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయరాదని, రూ.వందల కోట్ల విలువైన భూములను కాపాడుకోవడానికి ప్రభుత్వం మరోసారి న్యాయ పోరాటం చేయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైకాపా డిమాండ్‌ చేసింది. వైకాపా అధికారంలోకి రాగానే ఈ భూములను ప్రభుత్వపరం చేయడానికి తగిన చర్యలన్నీ తీసుకుంటామని ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పదేపదే చెప్పారు. ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి అప్పటి సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అది సరైన చర్య కాదని పాదయాత్ర సమయంలో ప్రతిపక్ష నేతగా మీరు ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మీ ప్రభుత్వ అధికారులే నిషేధిత జాబితా నుంచి ఆ భూములను తొలగించి, వాటిని మీకు అనుకూలంగా ఉన్న బిల్డర్లకు అప్పగించడానికి ప్రయత్నిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించడానికి ఉన్నత స్థాయి అధికారులతో సిట్‌ ఏర్పాటు చేయాలి. భూముల పరిరక్షణ కోసం నిర్ణయం తీసుకోవాలి. అలాకాని పక్షంలో ఈ కుంభకోణంలో కొందరు అధికార పార్టీ నేతలే, జిల్లా యంత్రాంగంతో కుమ్మక్కై పావులు కదుపుతున్నట్లు భావించాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని