అమరావతికి పోటీగా వివిధ వర్గాలతో కార్యక్రమాలు

అమరావతి రైతుల మహా పాదయాత్రకు పోటీగా మూడు రాజధానుల అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని నిర్ణయించిన అధికార పార్టీ.. అందుకు కార్యాచరణ రూపొందిస్తోంది.

Updated : 05 Oct 2022 10:46 IST

మూడు రాజధానులకు మద్దతుపై వైకాపా ప్రణాళిక

ఈనాడు, అమరావతి: అమరావతి రైతుల మహా పాదయాత్రకు పోటీగా మూడు రాజధానుల అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని నిర్ణయించిన అధికార పార్టీ.. అందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. శ్రీకాకుళం నుంచి మూడు రాజధానుల సంఘీభావ యాత్రను చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కాకినాడ నుంచి వాహన ర్యాలీ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రోజూ ఏదో ఒక మండల కేంద్రంలో మానవహారాలు, రాత్రివేళ కొవ్వొత్తుల ర్యాలీ వంటి కార్యక్రమాల ద్వారా మూడు రాజధానుల అవసరాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమాలు పార్టీ తరఫున కాకుండా మేధావులు, అధ్యాపకులు, న్యాయవాదులు, సామాజికవేత్తలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భావన కలిగేలా వారినే ముందుంచాలని ప్రణాళిక రచిస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా ఇప్పటివరకు విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశాల్లో ఇదే విధానాన్ని అనుసరించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మూడు రాజధానులే ఏకైక మంత్రమనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా చేపట్టాలని జిల్లాల యంత్రాంగానికి పార్టీ అధినాయకత్వం స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని