మునుగోడులో ప్రచారం హోరెత్తాలి

ఉప ఎన్నిక జరుగుతున్న మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం నుంచి ప్రచారం హోరెత్తాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలిచ్చారు. అధిష్ఠానం నియమించిన ఇన్‌ఛార్జీలంతా రంగంలోకి దిగి, ఇల్లిల్లూ తిరగాలని సూచించారు.

Updated : 05 Oct 2022 06:21 IST

కేంద్రం ధరలు పెంచిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మునుగోడులో తెరాసగానే పోటీ.. అభ్యర్థి కూసుకుంట్లే
నెలాఖరులో చండూరులో సభ
ఉప ఎన్నికపై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌  
ఈనాడు - హైదరాబాద్‌

ప ఎన్నిక జరుగుతున్న మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం నుంచి ప్రచారం హోరెత్తాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలిచ్చారు. అధిష్ఠానం నియమించిన ఇన్‌ఛార్జీలంతా రంగంలోకి దిగి, ఇల్లిల్లూ తిరగాలని సూచించారు. ఈ నెల చివరి వారంలో చండూరులో ఎన్నికల ప్రచార సభ నిర్వహించాలని ఆదేశించారు. సభలో తానూ పాల్గొంటానన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థిగానే కూసుకుంట్ల పోటీచేస్తారని స్పష్టంచేశారు.

మునుగోడు ఉప ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, 86 యూనిట్లకు ఇన్‌ఛార్జీలను ఖరారు చేశామని, ప్రచార ప్రణాళికను ఇప్పటికే వారికి అందజేశామని చెప్పారు. ప్రధానంగా కేంద్ర విద్యుత్తు బిల్లుపై విస్తృత ప్రచారం కల్పించాలని, భాజపాకు ఓటువేస్తే మోటార్లకు మీటర్లు తప్పవనే సందేశాన్ని రైతులకు ఇవ్వాలని మార్గదర్శనం చేశారు. వంటగ్యాస్‌, డీజిల్‌, పెట్రోలు ధరల పెంపు, తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యం వంటి అంశాలనూ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఫ్లోరైడ్‌ నుంచి మునుగోడుకు విముక్తి కల్గించిన తీరునూ వివరించాలన్నారు. సీపీఎం, సీపీఐ నేతలతో సమన్వయం చేసుకుంటూ ప్రచార బరిలోకి దిగేందుకు వీలుగా ఆయా పార్టీల నేతలతో గ్రామ, మండలస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని, ప్రచారానికి మూడు పార్టీల నేతలు కలిసే వెళ్లాలనే సూచనలు చేశారు. కేటీఆర్‌, హరీశ్‌రావు సహా ఇతర మంత్రులు ప్రచారంలో ఉంటారని, ఎవరికి నిర్దేశించిన మండలాల్లో వారే పనిచేస్తారన్నారు. అభ్యర్థి విషయమై చర్చ జరిగిన సందర్భంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ మాట్లాడుతూ, మునుగోడులో తెరాస అభ్యర్థిగానే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ప్రకటిస్తామన్నారు. పార్టీని భారాసగా   మారుస్తూ తీర్మానాన్ని గురువారమే కేంద్రానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ , ఆమోదానికి నెలరోజుల సమయం తీసుకునే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.  నియోజకవర్గంలో విభేదాలకు ఏమాత్రం తావియ్యకూడదని, పార్టీలో చేరికలను కొనసాగించాలని నేతలకు సూచించారు.

విందు..తర్వాత మరో భేటీ

జాతీయ పార్టీ ప్రకటన తర్వాత సీఎం ప్రగతిభవన్‌లో పార్టీ నేతలకు విందు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికలపై పార్టీ నేతలతో మరోసారి సమావేశం జరపనున్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts