Dharmana: అవినీతి చేశానని వేలెత్తి చూపితే రాజకీయాలు వదిలేస్తా: మంత్రి ధర్మాన

‘నా జీవితంలో అన్యాయంగా, అవినీతిగా ఒక పని చేశానని ఎవరైనా వేలెత్తి చూపితే శాశ్వతంగా రాజకీయాలను విరమించుకుంటాను’ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.

Published : 31 Oct 2022 06:57 IST

శ్రీకాకుళం సాంస్కృతికం, న్యూస్‌టుడే: ‘నా జీవితంలో అన్యాయంగా, అవినీతిగా ఒక పని చేశానని ఎవరైనా వేలెత్తి చూపితే శాశ్వతంగా రాజకీయాలను విరమించుకుంటాను’ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలోని బాపూజీ కళా మందిరంలో ఆదివారం జరిగిన సూత్రా ఫౌండేషన్‌ సంస్థ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘విశాఖ రాజధాని.. భవిష్యత్తుకు అవసరం. కానీ ఇదంతా సమాజంలో తగవులు పెట్టడానికి చేస్తున్నారని ఏదో పత్రికలో రాశారు. రాజధాని పెడితే తగవులెందుకు వస్తాయి? రాష్ట్ర సంపద విజయవాడలో పెడితే తర్వాత వారు వెళ్లిపోమంటారు. గతంలో హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టాం. ఏమైంది? ఆ అనుభవం ఉండగా మళ్లీ అది చేస్తామంటే తప్పు కదా? రాజధాని ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుబడులు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు వస్తాయి’ అని పేర్కొన్నారు. చంద్రబాబు అందరినీ మోసం చేశారని, రియల్‌ ఎస్టేట్‌ దోపిడీ కోసం రాష్ట్రంలో ఎవరికీ తెలియకుండా అమరావతిని రాజధానిగా ప్రకటించారని ఆరోపించారు. ‘శ్రీకాకుళం ప్రాంతవాసుల గొంతై నిజాయతీగా వాదిస్తాను. అది ప్రజాప్రతినిధిగా నా పని, కర్తవ్యం. నేను రామోజీరావు, చంద్రబాబుకు భయపడే రకం కాదు’ అని ధర్మాన చెప్పారు. తన గళం వినిపించేందుకు ఎమ్మెల్యేగానే ఉండక్కర్లేదన్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు ఈ ప్రాంత ప్రజల ఆశలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని.. జిల్లా ప్రజల నోరు కొట్టే ప్రయత్నం చేయవద్దని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని