Rayapati-Kanna: పరువు నష్టం కేసు.. రాయపాటి, కన్నా రాజీ

‘మీరిద్దరూ సీనియర్‌ నాయకులు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సినవాళ్లు. స్వల్ప విషయాలపై విమర్శలు చేసుకొని.. కేసు పెట్టుకుని కోర్టుకు వస్తే ఇతరులకు ఎలాంటి సందేశం ఇస్తారు?

Updated : 02 Nov 2022 06:52 IST

గుంటూరు లీగల్‌, న్యూస్‌టుడే: ‘మీరిద్దరూ సీనియర్‌ నాయకులు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సినవాళ్లు. స్వల్ప విషయాలపై విమర్శలు చేసుకొని.. కేసు పెట్టుకుని కోర్టుకు వస్తే ఇతరులకు ఎలాంటి సందేశం ఇస్తారు? ఒకసారి ఆలోచించండి. రాజీ ద్వారా సమస్యకు సామరస్య పూర్వకంగా ముగింపు పలికితే మంచిది’.. మాజీ మంత్రి, భాజపా నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ, తెదేపా నాయకుడు రాయపాటి సాంబశివరావులకు గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.రామ్‌గోపాల్‌ చేసిన సూచన ఇది. ‘మీరిద్దరూ రాజీ చేసుకోవడానికి అవకాశం ఉందా?’ అని ఆయన ప్రశ్నించగా.. వారు సరేనన్నారు. అప్పట్లో ఒకే పార్టీలో (కాంగ్రెస్‌) ఉన్నా మాట్లాడుకోని వారిద్దరూ పుష్కర కాలానికి రాజీపడ్డారు. మంత్రిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ అవినీతికి పాల్పడుతున్నారని 2010లో గుంటూరు ఎంపీగా ఉన్న రాయపాటి సాంబశివరావు ఆరోపించగా.. కన్నా రూ.కోటికి పరువు నష్టం దావా వేశారు. పన్నెండేళ్లుగా విచారణ సాగుతోంది. తాజాగా జడ్జి రామ్‌గోపాల్‌ వారి న్యాయవాదులతో మాట్లాడారు. రాజీ అవకాశాన్ని పరిశీలించాలని కన్నా తరఫు న్యాయవాది మున్నంగి సాంబిరెడ్డి, రాయపాటి తరఫు న్యాయవాది నీలం రామ్మోహనరావుకు సూచించగా వారు సుముఖత వ్యక్తం చేశారు. మంగళవారం ఇద్దరు నేతలను జడ్జి తన కార్యాలయంలోకి పిలిచి రాజీ కుదిర్చి కేసు కొట్టేస్తున్నట్లు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని