Pawan Kalyan: రూ.15వేల కోట్ల అవినీతి

‘జగనన్న కాలనీల పేరుతో ప్రభుత్వం రూ.10వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్ల అవినీతికి పాల్పడింది. రైతుల నుంచి ఎకరాకు రూ.2లక్షల నుంచి రూ.4లక్షలకు భూముల్ని కొనుగోలు చేసిన వైకాపా నేతలు రూ.30లక్షలు, రూ.20లక్షలు, రూ.18లక్షలకు విక్రయించారు’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు.

Updated : 14 Nov 2022 06:51 IST

జగనన్న కాలనీల్లో ఎటుచూసినా అక్రమాలే
ఇళ్లే నిర్మించలేని ప్రభుత్వం రాజధాని కడుతుందట
2024లో వైకాపా సర్కారు కూలిపోవాలి
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

ఈనాడు, విజయనగరం: ‘జగనన్న కాలనీల పేరుతో ప్రభుత్వం రూ.10వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్ల అవినీతికి పాల్పడింది. రైతుల నుంచి ఎకరాకు రూ.2లక్షల నుంచి రూ.4లక్షలకు భూముల్ని కొనుగోలు చేసిన వైకాపా నేతలు రూ.30లక్షలు, రూ.20లక్షలు, రూ.18లక్షలకు విక్రయించారు’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ఇదే విషయాన్ని ప్రజా సంక్షేమం కోరుకునే కొంతమంది అధికారులు తనతో చెప్పారని వివరించారు. ‘జగనన్న ఇళ్లు.. పేదలందరికీ కన్నీళ్లు’ కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా గుంకలాం లేఅవుట్‌ను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...  ‘ఇంటి నిర్మాణానికి కేంద్రమే రూ.1.80 లక్షలు ఇస్తోంది. రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఇక్కడ పైలాన్‌ తప్ప ఏమీ లేదు. కనీసం రహదారులు వేయలేదు. జగనన్న కాలనీల పేరుతో రూ.15వేల కోట్ల వ్యక్తిగత లబ్ధి పొందారు. దీనిపై కేంద్రానికి, ప్రధాని మోదీకి స్వయంగా నివేదిక అందిస్తా. ప్రజాస్వామ్యంలో అడిగేవారు లేకపోతే దోపిడీ పెరుగుతుంది. ఉత్తరాంధ్రపై నిజంగా ప్రేమ ఉంటే ఈపాటికే ఇళ్లు నిర్మించేవారు. ఇళ్లే కట్టలేనివారు కొత్తగా విశాఖలో రాజధాని కడతారా.. ఇది మేము నమ్మాలా’ అని ప్రశ్నించారు. ‘ఈసారి ఎన్నికల సమయంలో నామినేషన్లు వేయకుండా మమ్మల్ని ఆపినా.. బెదిరించినా కాళ్లు విరగ్గొట్టి, తాటతీసి నేలపై కూర్చోబెడతాం’ అని పవన్‌ హెచ్చరించారు. తెలంగాణలో 18 బీసీ కులాల రిజర్వేషన్లను తొలగించినా ఒక్కసారైనా సీఎం జగన్‌... తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఈ విషయమై అడగలేదని విమర్శించారు.

మీ వెనుక నేనున్నా

‘జనసేన అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇసుక ఉచితంగా ఇచ్చి తీరుతాం. అవినీతికి ఎవరు పాల్పడినా వారితో జైలు ఊచలు లెక్కింపజేస్తాం. ఈ రోజు దారి పొడవునా 14 కిలోమీటర్లు కమాండోల్లా యువత పరుగెత్తుకుంటూ వచ్చారు. వారి కోసం నేను ఏం చేయగలనా అనిపించింది. రూ.5వేలు, రూ.6వేల జీతానికి ఉద్యోగంలో నియమించాలనుకోవడం లేదు. పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి తీసుకెళ్లాలనేదే నా ఉద్దేశం. పేదలకు మేలు చేసే ఏ సంక్షేమ పథకాన్నీ ఆపేది లేదు. వాటిని కొనసాగిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. మేము మార్పు కోసం వచ్చిన వాళ్లం. మొన్నటి వరకు సంయమనం పాటించాం. వైకాపా నాయకులు మర్యాదగా మాట్లాడితే అలాగే మాట్లాడండి. వారు మర్యాద ఇవ్వకపోతే మీరూ ఇవ్వకండి. మీ వెనుక నేనున్నాను. నేను గాయపడ్డ పులిని. గడపగడపకూ వైకాపా నాయకులు వస్తే ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో.. ఇళ్ల నిర్మాణం ఎప్పుడు చేస్తారో నిలదీయండి.

దిల్లీలో నాపై చాడీలు

వైకాపా నాయకులు దిల్లీకి వెళ్లి చిన్నపిల్లల్లా చాడీలు చెబుతున్నారు. సజ్జల, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావుతోపాటు విశాఖలో ఉండే ప్రతి నాయకుడికీ చెబుతున్నా. నేను మీలాగా.. మీ నాయకుడిలాగా దిల్లీకి వెళ్లను. పవన్‌ కల్యాణ్‌ను ఆపండి అని.. పిచ్చి చాడీలు చెప్పను. మోదీపై నాకు అపార గౌరవం ఉంది. ఈ ప్రాంత సమస్యలను ఉత్తరాంధ్రలోనే తేలుస్తా.

జనసేనకు అవకాశం ఇద్దామని మీ పెద్దలకు చెప్పండి

ఉత్తరాంధ్ర చైతన్యం కలిగిన నేల. మీరు మారకపోతే, ప్రశ్నించకపోతే మార్పు రాదు. చొక్కా పట్టుకుని నిలదీయండి. 2024లో వైకాపా ప్రభుత్వం కూలిపోవాలి. జనసేన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వచ్చే ఎన్నికల్లో జనసేనకు అవకాశం ఇద్దామని మీ పెద్దలకు చెప్పండి. యువత భవిష్యత్తు కోసం అడుగుతున్నా. అవినీతి రహిత పాలన ఎలా ఉంటుందో చూపిస్తా. దశాబ్దాలుగా ఉన్న పార్టీలూ వైకాపా అంటే భయపడుతున్నాయి. రాష్ట్రంలో 3వేల పైచిలుకు కౌలు రైతులు చనిపోయారు. సినిమాలు చేసి రూ.30 కోట్లు రైతు సంక్షేమానికి ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నా. ఇప్పటివరకు రూ.6 కోట్లపైనే ఖర్చు పెట్టా. రైతు కన్నీరు పెట్టని రాజ్యం తీసుకొస్తాం. మత్స్యకారులు గోవా, గుజరాత్‌ వలస వెళ్లకుండా స్థానికంగా జట్టీలు నిర్మిస్తాం. వారికి హాని కలిగించే ఏ నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నా అడ్డుకుంటాం. ప్రకటనల కోసం కోట్ల డబ్బులిస్తానన్నా ఆపేశా. మీ కష్టాల కోసమే గొంతెత్తుతా. మీ బంగారు భవిష్యత్తుకు జనసేనను నమ్మండి...’ అని పవన్‌ పేర్కొన్నారు. అనంతరం కాలనీలోని  పలు ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా యువత నిరుద్యోగ ఉద్యోగ ప్రకటనలు రావడం లేదని, గదులు అద్దెకు తీసుకుని సన్నద్ధమవుతున్నామని తెలిపారు. సమస్యలపై పోరాడాలని, నాయకులను నిలదీయాలని పవన్‌ సూచించారు. పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, పీఏసీ సభ్యుడు నాగబాబు హాజరయ్యారు. రాజాపులోవ, మోదవలసవద్ద స్థానిక నాయకులు, కార్యకర్తలు గజమాల వేసి ఘన స్వాగతం పలికారు. ఉత్తరాంధ్ర వీర మహిళ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ తుమ్మి లక్ష్మీరాజ్‌, నియోజకవర్గ ఇన్‌ఛార్జి లోకం మాధవి పాల్గొన్నారు.

మఫ్టీలో పోలీసులు

గుంకలాంలో పోలీసులు పెద్ద ఎత్తున మఫ్టీలో కనిపించారు. మహిళా పోలీసులు సివిల్‌ డ్రెస్సులతో వచ్చారు. ఎవరెవరు హాజరయ్యారో వివరాలు సేకరించారు. లేఅవుట్‌ బాధితులు పత్రాలు తీసుకొని రాగా.. విలేకరులమని చెప్పి కొంతమంది వారి నుంచి వాటిని తీసుకున్నారు. ఈ విషయం తెలియడంతో జనసేన నాయకులు అప్రమత్తమయ్యారు. బాధితుల కోసం ఏర్పాటు చేసిన బారికేడ్ల నుంచి సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులను బయటకు పంపించారు. ఎవరికీ పత్రాలు ఇవ్వొద్దని చెప్పారు. గృహ నిర్మాణ శాఖాధికారులూ లేఅవుట్‌కు వచ్చారు. లబ్ధిదారులు ఏం చెబుతారో తెలుసుకుందామని వచ్చినట్లు ఓ అధికారి తెలిపారు.


ఆనందపురంలో బ్రహ్మరథం

విశాఖ నగరం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన పవన్‌ కల్యాణ్‌కు ఆనందపురం కూడలిలో కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. వేలాది మంది తరలిరావడంతో కూడలి జనసంద్రంగా మారింది. భారీ గజమాల వేసి అభిమానం చాటుకున్నారు. సింహాచలం భూముల సమస్య పరిష్కారానికి చొరవ చూపాలంటూ పలువురు కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. నాయకులు అందించిన ఓ ప్లకార్డును పవన్‌ వాహనంపై నుంచి ప్రదర్శించారు.

- న్యూస్‌టుడే, ఆనందపురం


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని