సంక్షిప్త వార్తలు(5)

‘సీఎం జగన్‌ ఏం చెబితే నేను అది పాటిస్తా. ఆయన ఇప్పటికే నాకు పెద్ద పదవి ఇచ్చారు’ అని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు.

Updated : 25 Nov 2022 06:35 IST

చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు భరతే

ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి

శ్రీరంగరాజపురం, న్యూస్‌టుడే: ‘సీఎం జగన్‌ ఏం చెబితే నేను అది పాటిస్తా. ఆయన ఇప్పటికే నాకు పెద్ద పదవి ఇచ్చారు’ అని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్‌పురం మండలం పద్మాపురంలో గురువారం ఆయన ‘గడపగడపకు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ భరత్‌ కొనసాగుతారని తెలిపారు.


రాళ్లదాడి ‘గూండా పాలన’కు నిదర్శనం

తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తాడిపత్రిలో తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి జేసీ అస్మిత్‌రెడ్డిపై రాళ్ల దాడి రాష్ట్రంలో సాగుతున్న గూండాపాలనకు నిదర్శనమని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘వార్డుల్లో పర్యటిస్తున్న అస్మిత్‌రెడ్డిపై వీధి దీపాలు ఆపి మరీ వైకాపా కార్యకర్తలు దాడి చేయడం దారుణం. ఈ ఘటనపై విచారణ చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని చంద్రబాబు గురువారం ట్వీట్‌ చేశారు. ఈ ఘటనపై ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ట్వీట్‌కు జత చేశారు.


తొలగించిన 26 కులాల్ని బీసీ జాబితాలో చేర్చాలి: భాజపా ఓబీసీ మోర్చా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాల్ని తిరిగి చేర్చాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, జాతీయ కార్యదర్శి పార్థసారథి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్సీ మాధవ్‌ కోరారు. రాజ్‌భవన్‌లో ఆమెను గురువారం కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. ఈ సమస్యపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించారని వారు వెల్లడించారు.


నోట్లరద్దు తీవ్ర లోపభూయిష్ట నిర్ణయం
సుప్రీంలో పి.చిదంబరం వాదన

దిల్లీ: కేంద్రం రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేస్తూ 2016లో తీసుకొన్న నిర్ణయం లోపభూయిష్టమని సీనియర్‌ న్యాయవాది పి.చిదంబరం గురువారం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. బ్యాంకు నోట్ల జారీని నియంత్రించే హక్కు భారతీయ రిజర్వుబ్యాంక్‌కు చెందినదిగా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌ సారథ్యంలోని అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ముందు నోట్లరద్దుకు వ్యతిరేకంగా మొత్తం 58 పిటిషన్లు దాఖలు కాగా, అందులో ఓ పిటిషనరు తరఫున చిదంబరం కోర్టుకు హాజరయ్యారు. దేశ ప్రజలను ఇబ్బంది పెట్టి, చట్టాన్ని అపహాస్యం చేసిన ఈ ప్రక్రియను కొట్టివేయాలని ఆయన కోరారు. ఈ నిర్ణయం లోపభూయిష్టమని ఉన్నత న్యాయస్థానం గుర్తిస్తే, కేంద్రం భవిష్యత్తులో ఇటువంటి దుస్సాహసాలు చేయదని చిదంబరం తెలిపారు. వచ్చే వారం కూడా ఈ విచారణ కొనసాగనుంది.  


సచిన్‌ పైలట్‌ ద్రోహి
సీఎం పదవికి అనర్హుడు : గహ్లోత్‌

దిల్లీ: రాజస్థాన్‌ కాంగ్రెస్‌ నేతల మధ్య విమర్శల పర్వం మరోసారి మొదలైంది. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఆ పార్టీ నేత సచిన్‌ పైలట్‌పై ప్రస్తుత సీఎం అశోక్‌ గహ్లోత్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పైలట్‌ను ద్రోహిగా అభివర్ణించడంతో పాటు సీఎం పదవికి అనర్హుడిగా పేర్కొన్నారు. 2020లో తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి సొంత పార్టీపైనే తిరుగుబాటు చేశారని, ఆ సమయంలో భాజపా నేతల సహాయాన్ని పొందారని ఆరోపించారు. చేసిన తప్పిదానికి క్షమించాలని అతను అప్పుడే కోరి ఉన్నట్లయితే ఇటీవల సోనియాగాంధీకి తాను క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చేది కాదన్నారు. అశోక్‌ గహ్లోత్‌ ఓ టీవీ ఛానెల్లో చేసిన వ్యాఖ్యలను సచిన్‌ పైలట్‌ తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఉపయోగించాల్సిన భాష కాదని పేర్కొన్నారు. మరొకరిపై బురద చల్లడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. సచిన్‌ గురువారం మధ్యప్రదేశ్‌లో రాహుల్‌, ప్రియాంకా గాంధీల వెంట భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఈ పాదయాత్ర త్వరలో రాజస్థాన్‌లో ప్రవేశించనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం రంగంలోకి దిగింది. త్వరలోనే గహ్లోత్‌, పైలట్‌ల మధ్య వివాదం సమసిపోతుందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని