తెలంగాణలో కమల వికాసం ఖాయం

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో భాజపా విజయం.. ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్‌ ధీమా వ్యక్తం చేశారు.

Published : 26 Nov 2022 03:53 IST

కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్‌
భాజపాలో చేరిన మర్రి శశిధర్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: రానున్న ఎన్నికల్లో తెలంగాణలో భాజపా విజయం.. ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్‌ ధీమా వ్యక్తం చేశారు. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మాజీ మంత్రి, కాంగ్రెస్‌ బహిష్కృత నేత మర్రి శశిధర్‌రెడ్డి సోనోవాల్‌ సమక్షంలో భాజపాలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లు శశిధర్‌రెడ్డికి సభ్యత్వం ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. శశిధర్‌రెడ్డిని మనస్ఫూర్తిగా భాజపాలోకి స్వాగతిస్తున్నట్లు సోనోవాల్‌ తెలిపారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెరాస అనైతిక పద్ధతుల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తెరాస గొయ్యిని తానే తవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. బండి సంజయ్‌ మాట్లాడుతూ.. రకరకాల అంశాలతో ప్రజల్లో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మర్రి శశిధర్‌రెడ్డి రాకతో భాజపా మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ విఫలమైనందున తెరాసను ఎదుర్కోవడం భాజపాతోనే సాధ్యమని శశిధర్‌రెడ్డి తెలిపారు. పార్టీ బలోపేతానికి సామాన్య కార్యకర్తగా పోరాడతానని, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రాణాలర్పించేందుకైనా సిద్ధమేనని అన్నారు. కార్యక్రమంలో భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌, చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, మాజీ ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, వివేక్‌ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రవీంద్ర నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణపై దృష్టి సారించాం: జె.పి.నడ్డా

తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించామని, నాయకులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా తెలిపారు. భాజపాలో శశిధర్‌రెడ్డి చేరిక తర్వాత నాయకులంతా నడ్డా నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. సుమారు 25 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. తెలంగాణలో పరిణామాలను ఆయనకు వివరించారు. జాతీయ నాయకత్వానికి అన్ని అంశాలపై అవగాహన ఉందని, మీ పని మీరు చేస్తూ వెళ్లాలని నడ్డా వారికి సూచించారు. ఈ నెల 28న ప్రారంభించనున్న అయిదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు కార్యక్రమానికి రావాలని సంజయ్‌ ఆహ్వానించగా నడ్డా సుముఖత వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని