చీలిక ఓట్ల చిద్విలాసం ఎవరిదో?

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఆసక్తికరంగా మారాయి. ఇదివరకు జరిగిన ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌ మధ్యే ప్రధానంగా పోటీ ఉండగా.. ఇప్పుడు ఇతర పార్టీలు సైతం రంగంలోకి దిగాయి.

Updated : 29 Nov 2022 03:58 IST

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో మజ్లిస్‌ పార్టీ
కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో మొదలైన గుబులు
త్రిముఖ, చతుర్ముఖ పోటీ తమకు మంచిదేనంటున్న భాజపా
బిలాల్‌ భట్‌

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఆసక్తికరంగా మారాయి. ఇదివరకు జరిగిన ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌ మధ్యే ప్రధానంగా పోటీ ఉండగా.. ఇప్పుడు ఇతర పార్టీలు సైతం రంగంలోకి దిగాయి. దీంతో ఏ పార్టీ ఓట్లు ఎవరు చీలుస్తారన్న ప్రశ్న ప్రధాన పార్టీలను వేధిస్తోంది. ఇప్పటికే ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ప్రచారంలో దూసుకుపోతూ.. కాంగ్రెస్‌, భాజపాలకు సవాల్‌ విసురుతోంది. మరోవైపు ఆల్‌ఇండియా మజ్లిస్‌-ఎ-ఇత్తెహదుల్‌ ముస్లిమీన్‌(ఏఐఎంఐఎం) కూడా రంగంలోకి దిగడంతో ఎన్నికల రణక్షేత్రం ఇంకాస్త రసవత్తరంగా మారింది. ముస్లిం జనాభా అధికంగా ఉన్న 13 సీట్లలో మజ్లిస్‌ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 11 నియోజకవర్గాల్లో ముస్లింలకే సీట్లు కేటాయించింది. ఈ పరిణామం అధికార భాజపాకే లాభం చేకూర్చేలా కనిపిస్తోంది.

భాజపాకు రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. కాంగ్రెస్‌, ఆప్‌ వంటి పార్టీలు భాజపాయేతర ఓటర్లనే ప్రధానంగా తమవైపు తిప్పుకునే పనిలో ఉన్నాయి. గుజరాత్‌లోని ముస్లింలను భాజపా వ్యతిరేక ఓటర్లుగా పరిగణిస్తుంటారు. భాజపాకు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్‌ వైపే ఇన్నాళ్లూ వీరంతా మొగ్గుచూపారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు పోటీగా ఆప్‌తో పాటు ముస్లిం వర్గాల ప్రతినిధిగా చెప్పుకొనే మజ్లిస్‌ సైతం బరిలో నిలిచింది. దీంతో ముస్లింల ఓట్లు మూడు పార్టీల మధ్య చీలే అవకాశం కనిపిస్తోంది.

ఇక్కడా బిహార్‌ పరిస్థితేనా..!

ఇటీవల బిహార్‌లోని గోపాల్‌గంజ్‌ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో ఏఐఎంఐఎం పోటీలో ఉండడం వల్ల భాజపా లబ్ధి పొందింది. ఆర్జేడీ అభ్యర్థిపై 1,794 ఓట్ల మెజారిటీతో భాజపా అభ్యర్థి విజయం సాధించారు. ఆ ఎన్నికలో మజ్లిస్‌ తరఫున పోటీ చేసిన అబ్దుల్‌ సలాం 12,214 ఓట్లు సాధించారు. ఈయన చీల్చిన ఓట్లే.. ఆర్జేడీ ఓటమికి కారణమయ్యాయి. అచ్చం అలాంటి పరిస్థితే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ జిల్లా జమల్‌పుర్‌ ఖడియా నియోజకవర్గంలో ఎదురుకానుంది. ఇక్కడ ఛిపా (ముస్లింలో ఓ వర్గం) ఓటర్లు అధికం. వీరంతా.. మూకుమ్మడిగా అదే వర్గానికి చెందిన అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ తరఫున ఇమ్రాన్‌ ఖేదీవాలా.. మజ్లిస్‌ తరపున సాబిర్‌ కబ్లివాలా బరిలో దిగుతున్నారు. వీరిద్దరూ ఛిపా వర్గానికి చెందినవారే. సాబిర్‌.. ఏఐఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు. ఇమ్రాన్‌.. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే. ఛిపా వర్గం ఓట్లు ఇరు ముస్లిం అభ్యర్థుల మధ్య చీలిపోయి.. భాజపా లాభపడే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

బాపునగర్‌లో కొత్త ఎత్తుగడ

అహ్మదాబాద్‌లోని బాపునగర్‌ నియోజకవర్గంలో మజ్లిస్‌ అభ్యర్థి షహనవాజ్‌ పఠాన్‌ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇక్కడ 16 శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఈ సీటులో కాంగ్రెస్‌ అభ్యర్థి హిమ్మత్‌ సింగ్‌ గెలుపు కోసమే ఇలా చేశారా? లేదా.. ఎంఐఎం వ్యూహాత్మక ఎత్తుగడ ఏమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. మజ్లిస్‌ అభ్యర్థి రేసు నుంచి తప్పుకొన్నప్పటికీ ఈ స్థానంలో పోటీలో ఉన్న 29 మంది అభ్యర్థుల్లో 10 మంది ముస్లింలే. అలాగే 27 శాతం ముస్లిం ఓటర్లు ఉన్న లింబాయత్‌ నియోజకవర్గంలోనూ 44 మంది అభ్యర్థులు పోటీ ఉండగా.. వారిలో 36 మంది ముస్లింలే కావడం గమనార్హం. ఈ ముస్లిం అభ్యర్థుల మధ్య వారి వర్గం ఓట్లు చీలిపోతే చివరకు లాభపడేది ఎవరో సులభంగానే అంచనా వేయవచ్చు.

ఎస్సీ నియోజకవర్గాలపై దృష్టి..

ఎస్సీ రిజర్వుడు సీటైన డానిలిమ్డాలో కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే శైలేశ్‌ పర్మార్‌పై అదే వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపారు ఒవైసీ. ఈ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ ఓటర్లతో పాటు ముస్లిం ఓటర్లు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ మొత్తం ఓటర్లు 2,39,999 కాగా.. వీరిలో 65,760 మంది ముస్లింలు. వీరి ఓట్లను గంపగుత్తగా ఎవరు కైవసం చేసుకుంటే.. వారికి విజయం సాధించే అవకాశాలు అధికం. అయితే, ఈసారి మజ్లిస్‌, కాంగ్రెస్‌ మధ్య ఈ ఓట్లు చీలే పరిస్థితి కనిపిస్తోంది. వడ్గాం అసెంబ్లీ సీటులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, ప్రముఖ సామాజిక కార్యకర్త జిగ్నేశ్‌ మేవానీపై మరో ఎస్సీ అభ్యర్థిని నిలబెట్టింది ఎంఐఎం. ఎస్సీ రిజర్వుడు సీటైన వడ్గాంలో 25 శాతం మంది ముస్లింలు ఉన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు