శాంతిభద్రతలను కాపాడలేని సర్కారిది

‘‘రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతోంది. వీటిని కాపాడే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు.

Updated : 29 Nov 2022 04:33 IST

ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలం
అడెల్లిలో బండి సంజయ్‌ వ్యాఖ్యలు
అయిదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం
నేడు భైంసా శివారులో బహిరంగసభ

ఈటీవీ-ఆదిలాబాద్‌: ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతోంది. వీటిని కాపాడే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ప్రజలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమవుతోంది’’ అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ‘ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును రాజ్యాంగం కల్పించింది. ప్రశ్నించేవారే ఉండకూడదంటే చూస్తూ ఊరుకోబోం’ అని ఆయన హెచ్చరించారు. సోమవారం రాత్రి నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం అడెల్లి మహా పోచమ్మకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన అయిదో విడత ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోతున్నాయని, భాజపా ప్రభుత్వం రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజాసంగ్రామ యాత్రతో కేసీఆర్‌కు వెన్నులో వణుకు పుడుతోందని ధ్వజమెత్తారు. ‘‘వైఎస్‌ షర్మిల కారవాన్‌పై తెరాస కార్యకర్తలు పెట్రోల్‌ పోసి తగలబెట్టే పరిస్థితి ఎందుకొచ్చింది? ఓ మహిళ అనికూడా చూడకుండా వాహనాన్ని తగలబెట్టడం దేనికి సంకేతం? జరగరానిదేమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? సీఎంవో ఆదేశాలమేరకే ప్రజా సంగ్రామ యాత్రను చివరి నిమిషంలో అడ్డుకున్నట్లు విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన పోలీసులే చెబుతున్నారు. కేసీఆర్‌ అడ్డుకుంటే యాత్ర ఆగదని నిన్న చెప్పాను. ఈ రోజు అడెల్లి పోచమ్మ పాదాలకు మొక్కి ప్రారంభించి చూపాను. కుంటి సాకులు చెప్పి పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తే కోర్టును ఆశ్రయించి అనుమతి పొందాం. కోర్టు ఉత్తర్వులకు లోబడే పాదయాత్ర, బహిరంగ సభలను నిర్వహిస్తాం. భైంసాను సున్నిత ప్రాంతంగా మార్చింది ఎవరో కేసీఆర్‌ చెప్పాలి. భైంసాకు రావాలంటే వీసా తీసుకొని రావాలా? అదేమైనా నిషేధిత ప్రాంతమా? భైంసాలో ప్రజలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఉండి ఏం లాభం? అని ప్రశ్నించారు. భాజపా ప్రభుత్వం కొలువుదీరగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు. ఫసల్‌బీమా పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి తీరుతామని సంజయ్‌ హామీ ఇచ్చారు.

ఎంఐఎం చెప్పినట్లు ప్రభుత్వం నడుస్తోంది

తెలంగాణ చౌక్‌ (కరీంనగర్‌), న్యూస్‌టుడే: అడెల్లికి బయలుదేరే ముందు కరీంనగర్‌లోనూ సంజయ్‌ విలేకరులతో మాట్లాడారు. భైంసాలో గతంలో జరిగిన ఘటనల గురించి ప్రస్తావించారు. ప్రభుత్వ ప్రోత్బలంతోనే అక్కడ ఎంఐఎం, తెరాస నాయకులు కుమ్మక్కై 30 ఇళ్లు ధ్వంసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సేవాభారతి ఆధ్వర్యంలో తాము 12 ఇళ్లు నిర్మించి ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎం చెప్పినట్లు నడుస్తోందని ఆరోపించారు. అమాయకులపై పీడీ కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. ఆ రెండు పార్టీలు చేసిన కుట్రలు బయటపడతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు.

అడెల్లిలో ఘనస్వాగతం

భారీ కాన్వాయ్‌ వెంటరాగా... నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ స్వయంగా నడుపుతున్న వాహనంలో.. అడెల్లి పోచమ్మ దేవాలయానికి చేరుకున్న బండి సంజయ్‌కు భాజపా కార్యకర్తలు బాజా భజంత్రీలతో ఘనస్వాగతం పలికారు. ఆలయంలో సంజయ్‌ ప్రత్యేక పూజలు చేశారు. నిర్మల్‌ జిల్లా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రామారావు పటేల్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, యాత్ర ప్రముఖ్‌ గంగిడి మనోహార్‌రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ తర్వాత భైంసాకు రాత్రి 10.30 గంటలకు చేరుకున్న బండి సంజయ్‌ పట్టణ సమీపంలో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయంలో బసచేశారు.

శివారుకు మారిన సభావేదిక

భైంసా పట్టణం, న్యూస్‌టుడే: అయిదోవిడత ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిర్వహించే బహిరంగ సభ మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు భైంసా శివారులో జరగనుంది. నిర్మల్‌ జాతీయ రహదారి పక్కనున్న గణేశ్‌ ఇండస్ట్రీ ప్రాంగణంలో ఈ సభను నిర్వహించాలని సోమవారం రాత్రి 11 గంటలకు ఆ పార్టీ నాయకులు నిర్ణయించారు. భైంసాకు మూడు కిలోమీటర్ల దూరంలో సభ నిర్వహించుకోవాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో వేదికను మార్పు చేశారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వస్తారని బండి సంజయ్‌ చెప్పారు.


3 కి.మీ.ల దూరంలో సభ నిర్వహించుకోండి: హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: నిర్మల్‌ జిల్లా భైంసాలో భారతీయ జనతాపార్టీ నిర్వహించదలచిన బహిరంగ సభ, ర్యాలీలకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. ర్యాలీ, సభలను భైంసాకు 3 కిలోమీటర్ల దూరంలో నిర్వహించుకోవాలని, రూట్‌ మ్యాప్‌ను ముందుగా పోలీసులకు అందజేయాలని సూచించింది. పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలెవరూ ఇతర మతాల విశ్వాసాలను దెబ్బతీసేలా నినాదాలు చేయకూడదంది. ర్యాలీలో పాల్గొనే కార్యకర్తలెవరూ కర్రలు, ఆయుధాలు కలిగి ఉండరాదంది. అంతేగాక సాయంత్రం 5 గంటల్లోగా సమావేశాన్ని ముగించాలంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశించింది. పాదయాత్ర సందర్భంగా ఏవైనా షరతులను ఉల్లంఘిస్తే పోలీసులు చర్యలు తీసుకోవచ్చంది. అనుకోని కారణాల వల్ల సమావేశాన్ని సోమవారం నిర్వహించని పక్షంలో ఇవే షరతులతో 29న నిర్వహించుకోవచ్చని పార్టీకి అనుమతించింది. పాదయాత్ర ర్యాలీ సందర్భంగా ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగించరాదని ఆదేశిస్తూ విచారణను డిసెంబరు 5వ తేదీకి వాయిదా వేసింది.

ప్రజా సంగ్రామయాత్ర ప్రారంభం సందర్భంగా భైంసా రోడ్డు వై జంక్షన్‌ వద్ద సభకు అనుమతి నిరాకరిస్తూ నిర్మల్‌ ఎస్పీ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ.. భోజన విరామ సమయంలో విచారణ చేపట్టాలంటూ భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి సోమవారం హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మధ్యాహ్నం జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎన్‌.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ సభను చార్మినార్‌ వద్ద నిర్వహిస్తే ఉద్రిక్తతలకు అవకాశం ఉందనవచ్చేమో కానీ.. భైంసాలో నిర్వహించే సభకు అభ్యంతరం చెప్పడం సరికాదన్నారు. దీనిపై అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ 15 వేల మంది సమావేశానికి హాజరవుతారని, మతపరమైన ఘర్షణలకు అవకాశం ఉన్న భైంసాలో శాంతి భద్రతల పరిరక్షణ కష్టమవుతుందని తెలిపారు. వారి యాత్రలోనే ‘సంగ్రామం’ అని ఉందని, ఇది ఉద్రిక్తతలకు దారి తీస్తుందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి యాత్రకు షరతులతో అనుమతించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని