విశాఖ భూ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి

విశాఖలో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల వివాదాస్పద భూముల దురాక్రమణలపై సీబీఐతోగానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తితోగానీ విచారణ జరిపించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండు చేశారు.

Updated : 30 Nov 2022 05:49 IST

సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ

ఈనాడు, అమరావతి: విశాఖలో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల వివాదాస్పద భూముల దురాక్రమణలపై సీబీఐతోగానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తితోగానీ విచారణ జరిపించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండు చేశారు. నాటి భూ కబ్జాలపై విచారణ కోసం తెదేపా నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం నియమించిన ‘సిట్‌’ నివేదికలోని అంశాలను ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం జగన్‌కు మంగళవారం సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ‘ఈ లేఖను మీ ‘స్పందన’లో వచ్చిన అత్యవసర ఫిర్యాదుగా స్వీకరించి వెంటనే ఉత్తరాంధ్ర భూ కబ్జాలపై స్పందించాలి. 2004 నుంచి 2022 వరకు జరిగిన భూబాగోతాలపై జరిపిన దర్యాప్తు నివేదికలను బహిర్గతం చేయాలి. మీరు అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు గడుస్తున్నా సిట్‌ విచారణలోని అంశాలు ఎందుకు బహిర్గతం చేయడం లేదు. గత రెండు దశాబ్దాలుగా విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయి. మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులకు కేటాయించిన ప్రభుత్వ భూములను బెదిరించి స్వాధీనం చేసుకుని ఆ తరవాత ఎన్‌ఓసీలు పొందారు. వీటితోపాటు దేవస్థానం భూములనూ గద్దల్లా తన్నుకుపోతున్నా ఎందుకు వదిలేస్తున్నారని మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా.

ప్రధాన ప్రతిపక్ష సహకారం కోరాలి

భూముల కబ్జాలకు చెక్‌ పెట్టేందుకు మీ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష సహకారం కోరాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా విచారణలో  సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా. 2004లో వైఎస్‌ ప్రభుత్వ హయాంలో మొదలైన భూ దందా 2019లో చంద్రబాబు నాయుడి హయాం వరకు జరిగినట్లు మీరు, మీ పార్టీవారు ఆరోపించారు. 2019 నుంచి ఇప్పటివరకు మీ ప్రభుత్వంలోనూ అక్రమ భూ కేటాయింపులు, అవకతవకలు జరిగాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మీరు స్పందించాలి’ అని సోము వీర్రాజు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని