నడి వేసవిలో వణికించిన వాన

భగభగమనే ఎండలతో దాదాపు 10 రోజులుగా అల్లాడిన రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. మంగళవారం ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది.

Updated : 08 May 2024 09:23 IST

మియాపూర్‌లో అత్యధికంగా 13.3 సెంటీ మీటర్ల వర్షపాతం
సంగారెడ్డి, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లోనూ భారీ వర్షం
కొట్టుకుపోయిన ధాన్యరాశులు
వేర్వేరు ఘటనల్లో ఏడుగురి మృతి

ఈనాడు, హైదరాబాద్‌: భగభగమనే ఎండలతో దాదాపు 10 రోజులుగా అల్లాడిన రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. మంగళవారం ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. మరోవైపు ఈదురుగాలులు, వడగళ్ల కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో ఏడుగురి మృతి  చెందారు. హైదరాబాద్‌ నగరంలో రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. సాయంత్రం ఒక్కసారిగా కుండపోతగా వాన కురవడంతో రహదారులన్నీ ట్రాఫిక్‌తో స్తంభించిపోయాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా మియాపూర్‌లో 13.3, కూకట్‌పల్లిలో 11.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలో మంగళవారం అత్యధికంగా కామారెడ్డి జిల్లా బిచ్కుంద, నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో 44.7 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్‌, ఆదిలాబాద్‌, నల్గొండ జిల్లాలతోపాటు నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని అనేక మండలాల్లో 43.3 డిగ్రీల నుంచి 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం ఒక్కసారిగా చినుకులు పడటంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. అయితే, క్రమంగా భారీ వర్షంగా మారడంతో పరిస్థితి తారుమారైంది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ఉమ్మడి కరీంనగర్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన భయానక పరిస్థితి సృష్టించింది. ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. జొన్న, వేరుసెనగ, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో బస్తాల కొద్దీ ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు తల్లడిల్లారు. యాదగిరిగుట్టపై కొత్తగా నిర్మించిన డార్మిటరీ హాల్‌ ఈదురుగాలులకు కూలిపోయి ద్విచక్రవాహనాలపై పడటంతో ధ్వంసమయ్యాయి. నల్గొండ, సంగారెడ్డి, మెదక్‌, పెద్దపల్లి, సిద్దిపేట, భద్రాద్రి జిల్లాల్లోనూ హఠాత్తుగా వర్షం కురవడంతో రైతులకు దిక్కుతోచలేదు.

అతలాకుతలమైన నగరం

రాజధాని నగరంపై ఆకాశం ఒక్కసారిగా ఉరిమింది. భారీ ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అనేక ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున ఫీడర్లు ట్రిప్‌ కావడంతో సరఫరా పునరుద్ధరణ ఆలస్యమైంది. మియాపూర్‌, కేపీహెచ్‌బీ, చందానగర్‌, సికింద్రాబాద్‌, లింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, బాలానగర్‌, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, కూకట్‌పల్లి ప్రాంతాల్లో జోరువాన కురిసింది. రహదారుల్లో వరద కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి.సాయంత్రం కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లలేక ఉద్యోగులు ఎక్కడికక్కడ స్తంభించిపోయారు.

ఏడుగురి మృతి

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని దేవేందర్‌ కాలనీకి చెందిన మాదాసు నాగబాల గంగాధరరావు(38), చింతపల్లి సుబ్రమణ్యం(40) మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం రాయిలాపూర్‌లో గోడకు ప్లాస్టరింగ్‌ చేస్తుండగా వర్షం కురవడంతో పక్కన నిల్చున్నారు. నిర్మాణంలో ఉన్న గోడ కూలి వారిపై పడటంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బాచుపల్లిలోని రేణుకా ఎల్లమ్మ కాలనీలో గోడకూలి ఓ కార్మికుడు (22) మృతి చెందారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లిలో రైతు కుమ్మరి మల్లేశం(36), సంగారెడ్డి జిల్లా అందోలు మండలం ఎర్రారం గ్రామానికి చెందిన బోయిని పాపయ్య(52) పిడుగుపాటుకు గురై మృతిచెందారు. వరంగల్‌ జిల్లా ఇల్లంద గ్రామానికి చెందిన ఆబర్ల దయాకర్‌(22), నవీన్‌ కలిసి ట్రాక్టరులో వెళ్తుండగా వర్ధన్నపేట మండలం కట్య్రాల గ్రామ శివారులో ఎండిన వృక్షం విరిగి వారిపై పడటంతో దయాకర్‌ మృతిచెందారు. పాతబస్తీ పరిధి బహదూర్‌పురలో విద్యుదాఘాతంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

నేడు.. రేపు ఓ మోస్తరు వర్షాలు

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సూచించింది. ‘పసుపు’ రంగు హెచ్చరికలు జారీ చేసింది.


తక్షణం సహాయక చర్యలు చేపట్టండి

భారీ వర్షం నేపథ్యంలో గ్రేటర్‌ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌లో మంగళవారం వర్షం కారణంగా నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతోపాటు ట్రాఫిక్‌ సమస్యలు, విద్యుత్తు అంతరాయాలు తలెత్తిన దృష్ట్యా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. వరంగల్‌ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌రాస్‌, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ రిజ్వి తదితర ఉన్నతాధికారులతో సమీక్షించారు. పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని ఉన్నతాధికారులు తెలపగా.. వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. ప్రభుత్వ యంత్రాంగం చేపట్టే సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని, సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు సూచించారు.


ఐటీ దారిలో భారీ ట్రాఫిక్‌ జామ్‌

సైబరాబాద్‌లోని ఐటీ క్షేత్రంపై మంగళవారం సాయంత్రం భారీ వర్షం తీవ్ర ప్రభావం చూపింది. 6 గంటల నుంచి పలు రహదారుల్లో ట్రాఫిక్‌ స్తంభించింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో దుర్గం చెరువు, టీ హబ్‌ రాయదుర్గం, మెట్రో మైహోం భుజా నుంచి బయో డైవర్సిటీ మార్గంలో స్తంభించిన ట్రాఫిక్‌ ఇదీ.

ఈనాడు, హైదరాబాద్‌


ఏపీలోనూ భారీ వర్షాలు..

ఏపీలోని రాజమహేంద్రవరంతోపాటు విజయవాడలలోనూ భారీ వర్షాలతో జనజీవనం కాసేపు స్తంభించింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో 12.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రం ముందుకొచ్చి అలజడి సృష్టించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని