అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూ తేదీలు వచ్చేశాయ్‌

యూఎస్‌లో ఉన్నత విద్య చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఈ నెల 31 వరకూ విద్యార్థి వీసా ఇంటర్వ్యూ సమయాల (స్లాట్స్‌)ను అమెరికా ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది.

Updated : 08 May 2024 08:36 IST

ఈ నెల 31 వరకు స్లాట్ల విడుదల
దశలవారీగా జూన్‌, జులై నెలలకు..
ఆదివారాల్లోనూ వేలిముద్రల నమోదుకు అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: యూఎస్‌లో ఉన్నత విద్య చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఈ నెల 31 వరకూ విద్యార్థి వీసా ఇంటర్వ్యూ సమయాల (స్లాట్స్‌)ను అమెరికా ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు హైదరాబాద్‌, చెన్నై, ముంబయి, కోల్‌కతాలలోని కాన్సులేట్‌ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఈ స్లాట్లను బుక్‌ చేసుకోవచ్చు.

‘అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు విడుదల’ శీర్షికన ఈ నెల 3న ‘ఈనాడు’లో కథనం వెలువడిన విషయం తెలిసిందే. ఈ దఫా విస్తృత స్థాయిలో స్లాట్లు విడుదల చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దశలవారీగా స్లాట్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అమెరికా కాన్సులేట్‌ అధికారి ప్రతినిధి ‘ఈనాడు’కు చెప్పారు. జూన్‌ నెల స్లాట్లు ఈ నెల మూడో వారంలో, ఆ తర్వాత జులైకు, అవసరాన్ని బట్టి ఆగస్టు నెలకు ఇంటర్వ్యూ తేదీలనూ విడుదల చేయనుంది. అమెరికాలో రెండు సెమిస్టర్ల విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫాల్‌ సీజన్‌ ఏటా ఆగస్టు-సెప్టెంబరులో ప్రారంభం అవుతుంది. ఈ సీజన్‌లో అక్కడి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు సమాయత్తం అవుతారు.

ఆదివారాల్లోనూ...

వీసా ప్రక్రియలో భాగంగా తొలుత వేలిముద్రల నమోదు, తరువాత ప్రత్యక్ష ఇంటర్వ్యూ విధానాన్ని అమెరికా అమలు చేస్తుంది. అమెరికా రాయబార కార్యాలయంతోపాటు అన్ని కాన్సులేట్‌ కార్యాలయాలకు శని, ఆదివారాలు సెలవు. అయితే విద్యార్థుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతానికి వేలిముద్రల నమోదుకు శనివారాల్లో, ఆదివారాలైన ఈ నెల 19, 26 తేదీల్లోనూ స్లాట్లు కేటాయించారు.

అక్టోబరులో పర్యాటక వీసాలు?

విద్యార్థుల వీసాల ప్రక్రియ పూర్తయ్యాక.. పర్యాటక వీసా (బి1, బి2) స్లాట్లు అందుబాటులోకి వస్తాయని సమాచారం. ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబరు రెండో వారంలోగా విద్యార్థి వీసాల ప్రక్రియ పూర్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ వెంటనే సెప్టెంబరు చివరి వారం లేదా అక్టోబరులో పర్యాటక వీసా స్లాట్లు జారీ అవుతాయని సమాచారం. నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అంతకుముందుగానే పర్యాటక వీసాల ప్రక్రియ పూర్తి చేయాలని ఆ దేశం యోచిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని