టాటా సెమీ కండక్టర్‌ చిప్‌ల ఎగుమతి!

మన దేశం నుంచి సెమీ కండక్టర్‌ చిప్‌సెట్ల ప్రయోగాత్మక ఎగుమతి ప్రారంభమైంది. చిప్‌సెట్ల కోసం దిగుమతులపైనే ఆధారపడిన మన దేశానికి ఇది ఎంతో ప్రోత్సాహకర అంశమే.

Published : 08 May 2024 03:48 IST

బెంగళూరు కేంద్రం నుంచి జపాన్‌, అమెరికా, ఐరోపాల్లోని భాగస్వాములకు

న దేశం నుంచి సెమీ కండక్టర్‌ చిప్‌సెట్ల ప్రయోగాత్మక ఎగుమతి ప్రారంభమైంది. చిప్‌సెట్ల కోసం దిగుమతులపైనే ఆధారపడిన మన దేశానికి ఇది ఎంతో ప్రోత్సాహకర అంశమే. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న టాటా ఎలక్ట్రానిక్స్‌, ఇక్కడి తమ పరిశోధన, అభివృద్ధి కేంద్రంలో ప్రయోగాత్మకంగా ఈ చిప్‌సెట్లను తయారు చేసింది. జపాన్‌, అమెరికా, ఐరోపాల్లోని టాటా ఎలక్ట్రానిక్స్‌ భాగస్వాములకు ఈ ప్యాకేజ్డ్‌ చిప్‌లను అతి తక్కువ సంఖ్యలో ఎగుమతి చేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయని ఆంగ్లపత్రికలు తెలిపాయి.

టాటా గ్రూప్‌ సంస్థ అయిన టాటా ఎలక్ట్రానిక్స్‌ మన దేశంలో చిప్‌సెట్ల తయారీ కోసం అస్సాంలోని మోరిగావ్‌లో చిప్‌ ప్యాకేజింగ్‌ యూనిట్‌తో పాటు, గుజరాత్‌లోని ధోలేరాలో 10 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.83,000 కోట్ల) పెట్టుబడితో చిప్‌ ఫౌండ్రీకి పునాది వేసిన సంగతి విదితమే. 28, 40, 55, 65 నానోమీటర్‌ సెమీ కండక్టర్‌ చిప్‌ల రూపకల్పన ప్రక్రియల్లోనూ కంపెనీ తుది దశలో ఉందని తెలుస్తోంది. ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఈ చిప్‌సెట్లను వినియోగించే ముందు, వీటి డిజైన్‌ ఆశించిన ఫలితాలను ఇస్తోందా, ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డులో అమర్చేందుకు తగిన విధంగా ఉందా అనేది పరిశీలించనున్నారు. వీటిని కూడా ప్రయోగాత్మకంగా తయారు చేసి, ఎంపిక చేసిన ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తిదారులకు పంపుతారు. వారి అభిప్రాయాల మేరకు అవసరమైన మార్పులు చేస్తారు. 2027 నుంచి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనున్నారు.

 ప్రస్తుతం ప్రయోగాత్మకంగా చిప్‌సెట్లను రూపొందిస్తున్నందున, వేర్వేరు రంగాల్లో వినియోగించే ఎలక్ట్రానిక్స్‌ తయారీలోనూ వాడతారు. తదుపరి ఆర్డర్ల మేరకు ప్రతి రంగానికి ప్రత్యేక చిప్‌సెట్లను డిజైన్‌ చేస్తారని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు