ఐపీఎల్‌.. మళ్లీ భారమేనా?

ఐపీఎల్‌, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్‌లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్‌ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్‌ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస!

Updated : 09 May 2024 00:49 IST

ఈనాడు క్రీడావిభాగం

ఐపీఎల్‌, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్‌లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్‌ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్‌ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస!

ఈసారి కూడా ఇదే కథ పునరావృతం అవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు భారత ఆటగాళ్లు ఫిట్‌నెస్‌ సమస్యల నుంచి కోలుకుని సున్నితమైన స్థితిలో ఐపీఎల్‌లో అడుగు పెట్టారు. విరామం లేకుండా మ్యాచ్‌లు ఆడేస్తున్నారు. విదేశీ ఆటగాళ్లు మాత్రం ప్రపంచకప్‌కు ప్రాధాన్యమిస్తూ ఐపీఎల్‌కు దూరమవుతుంటే.. మన వాళ్లు అప్రాధాన్య మ్యాచ్‌ల్లోనూ కొనసాగుతూ భారం పెంచుకుంటుండడం ఆందోళన రేకెత్తిస్తోంది.

వెస్టిండీస్‌, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌ జూన్‌ 2న ఆరంభం కాబోతోంది. అంతకు కేవలం వారం ముందే ఐపీఎల్‌ ముగియనుంది. ఐపీఎల్‌లో ఎంత ఒత్తిడి ఉంటుందో తెలిసిందే. పెద్దగా విరామం, విశ్రాంతి లేకుండా 50 రోజుల పాటు మ్యాచ్‌లు ఆడితే ఆటగాళ్లు ఎంతో అలసటకు గురవుతారు. మిగతా సందర్భాల్లో అయితే సరే కానీ.. ఈసారి ఐపీఎల్‌ అవ్వగానే పొట్టి కప్పు మొదలు కానున్న నేపథ్యంలో ఆటగాళ్లకు చాలినంత విశ్రాంతి అవసరం. కానీ ఐపీఎల్‌లో భారత స్టార్లు ఎవ్వరికీ విశ్రాంతి అన్న మాటే లేదు. వరుసగా మ్యాచ్‌లు ఆడేస్తున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా జట్లకు చెందిన ఆటగాళ్లు ఐపీఎల్‌ చివరి దశలో అందుబాటులో ఉండట్లేదు. ఇంగ్లాండ్‌ జట్టులోని బట్లర్‌, బెయిర్‌స్టో, ఫిల్‌సాల్ట్‌, సామ్‌ కరన్‌, మొయిన్‌ అలీ, లివింగ్‌స్టన్‌ ప్లేఆఫ్స్‌కు ముందే ఐపీఎల్‌ వీడనున్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాక్స్‌వెల్‌, వార్నర్‌లకు ఐపీఎల్‌లో తగినంత విశ్రాంతి లభిస్తోంది. మిగతా దేశాల ఆటగాళ్లలో కొందరు ముందే ఐపీఎల్‌కు దూరమయ్యారు. భారత ఆటగాళ్లకు అలాంటి అవకాశమే లేదు. పోనీ ముందే వారిని లీగ్‌లో రొటేట్‌ చేస్తూ అలసటకు గురి కాకుండా చూస్తున్నారా అంటే అదీ లేదు. ఇది టీ20 ప్రపంచకప్‌లో ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపుతుందనే ఆందోళన రేకెత్తిస్తోంది.

బుమ్రా.. భద్రమా?

టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతను దూరం కావడం 2022 పొట్టి కప్పులో భారత్‌ అవకాశాలపై తీవ్ర ప్రభావమే చూపింది. చాన్నాళ్లుగా టీ20లు ఆడని షమి, భువనేశ్వర్‌లను జట్టులోకి ఎంపిక చేయాల్సి వచ్చింది. బుమ్రా శరీరం ఎంత సున్నితమో ఇంతకుముందే చూశాం. ఈ నేపథ్యంలో ఈసారి అతణ్ని ప్రపంచకప్‌ ముంగిట జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ముంబయికి ప్లేఆఫ్స్‌ అవకాశాలు లేకపోయినా అతణ్ని తుది జట్టులో కొనసాగిస్తున్నారు. బుమ్రాకు విశ్రాంతినివ్వడంపై అసలు చర్చే జరగలేదని ముంబయి బ్యాటింగ్‌ కోచ్‌ పొలార్డ్‌ చెప్పడం గమనార్హం. ఇక ముంబయికి సారథ్యం వహిస్తున్న హార్దిక్‌ పాండ్య కూడా చాన్నాళ్ల పాటు ఫిట్‌నెస్‌ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. ముంబయి కెప్టెన్సీ మార్పు తాలూకు వివాదంతో అతను సతమతం అయ్యాడు. కానీ వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఫిట్‌నెస్‌పై సందేహాలున్నప్పటికీ బౌలింగ్‌ చేస్తున్నాడు. ఇదే జట్టులో రోహిత్‌ శర్మ కూడా వరుసగా మ్యాచ్‌లు ఆడేస్తున్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం కొన్ని నెలల పాటు మైదానానికి దూరంగా ఉండి ఐపీఎల్‌కు ఆలస్యంగా అందుబాటులోకి వచ్చాడు. ఆ తర్వాత విరామం లేకుండా మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ప్రపంచకప్‌ ఆడబోయే మిగతా ఆటగాళ్లు కూడా ఐపీఎల్‌లో చివరి వరకు కొనసాగబోతున్నారు. మరి వీళ్లంతా తీవ్ర ఒత్తిడితో కూడిన ఐపీఎల్‌లో వరుసగా మ్యాచ్‌లు ఆడుతూ.. రోజూ ప్రయాణాలు చేస్తూ తీవ్ర అలసటకు గురయ్యాక.. వారం తిరక్కుండానే వెస్టిండీస్‌-అమెరికాకు వెళ్లి పొట్టి కప్పులో పూర్తి స్థాయి ప్రదర్శన చేయగలరా అన్నది ప్రశ్న.

‘‘బుమ్రాకు విశ్రాంతినిచ్చే విషయమై ఎలాంటి చర్చ జరగలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. ఆటగాళ్లు ఐపీఎల్‌ పూర్తిగా ఆడేందుకే ఇక్కడికి వచ్చారు. కొన్నిసార్లు చాలా ముందుకు వెళ్లి ప్రపంచకప్‌ లాంటి టోర్నీల గురించి ఆలోచిస్తాం. ముందు ఐపీఎల్‌ పూర్తి కానివ్వండి. తర్వాత బుమ్రా భారత జట్టులోకి వెళ్తాడు. అక్కడ తన విశ్రాంతి గురించి ఆలోచిస్తారు’’

పొలార్డ్‌, ముంబయి బ్యాటింగ్‌ కోచ్‌

‘‘ఈ ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ తన ప్రదర్శనల పట్ల నిరాశ చెంది ఉంటాడు. సీజన్‌ను అతను బాగానే ఆరంభించాడు. కానీ తర్వాత గాడి తప్పాడు. బహుశా అలసట అతడిపై ప్రభావం చూపుతుండొచ్చు. ఒక విరామం అతడికి చాలా మేలు చేయొచ్చు. అప్పుడు కచ్చితంగా ఫామ్‌లోకి వస్తాడు’’

మైకేల్‌ క్లార్క్‌, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు