వైకాపా నేతలపై క్రిమినల్‌ కేసు

వైకాపా సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్సీ పోతుల సునీతలపై మంగళగిరి మేజిస్ట్రేట్‌ కోర్టులో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తరఫున బుధవారం క్రిమినల్‌ కేసు దాఖలు చేసినట్లు సీనియర్‌ న్యాయవాది దొద్దాల కోటేశ్వరరావు తెలిపారు.

Published : 01 Dec 2022 04:57 IST

మంగళగిరి మేజిస్ట్రేట్‌ కోర్టులో దాఖలు చేసిన నారా లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్సీ పోతుల సునీతలపై మంగళగిరి మేజిస్ట్రేట్‌ కోర్టులో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తరఫున బుధవారం క్రిమినల్‌ కేసు దాఖలు చేసినట్లు సీనియర్‌ న్యాయవాది దొద్దాల కోటేశ్వరరావు తెలిపారు. ఎన్టీఆర్‌ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య నేపథ్యంలో లోకేశ్‌పై దేవేందర్‌రెడ్డి అనుచిత రాతలు రాశారని, జూబ్లీహిల్స్‌లోని 5.73 ఎకరాల భూ వివాదమే ఆమె ఆత్మహత్యకు కారణమని ట్విటర్‌లో దుష్ప్రచారం చేశారని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో ఈ ఏడాది సెప్టెంబరు 4న పోతుల సునీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలపై నిరాధార, అనుచిత వ్యాఖ్యలు చేశారు. లోకేశ్‌ కుటుంబ పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించడంతో వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టును కోరాం’ అని కోటేశ్వరరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని