రావణుడంటారు.. హిట్లరంటారు

తనను తిట్టేందుకు కాంగ్రెస్‌ నేతల మధ్య పోటీ జరుగుతోందని, అందుకే రావణుడు, హిట్లర్‌ అంటూ రకరకాలుగా తనను దుర్భాషలాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Published : 02 Dec 2022 04:23 IST

నన్ను తిట్టడానికి కాంగ్రెస్‌ నేతల పోటీ
గుజరాత్‌ ఎన్నికల ప్రచార సభలో మోదీ

అహ్మదాబాద్‌, దిల్లీ: తనను తిట్టేందుకు కాంగ్రెస్‌ నేతల మధ్య పోటీ జరుగుతోందని, అందుకే రావణుడు, హిట్లర్‌ అంటూ రకరకాలుగా తనను దుర్భాషలాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్‌ రెండో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మోదీ వివిధ సభల్లో ప్రసంగించారు. తనను రావణుడిగా అభివర్ణించిన కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. ఇటీవల తనను వంద తలలు రావణుడితో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలతో పాటు.. ఇతర కాంగ్రెస్‌ నేతలు చేసిన దూషణలనూ ప్రస్తావించారు. గాంధీ కుటుంబాన్ని సంతోషపరిచేందుకు ఈ రకమైన భాషను కాంగ్రెస్‌నేతలు వాడుతున్నారని పంచ్‌మహల్‌ జిల్లాలోని కలోల్‌లో జరిగిన సభలో మోదీ అన్నారు. ‘‘ఖర్గేను గౌరవిస్తాను. ఆయన మాత్రం ఏం చేస్తారు.. అధిష్ఠానం ఆదేశాలను పాటించాలి కదా.. అందుకే నన్ను వంద తలల రావణుడని అన్నారు. గుజరాత్‌ రామభక్తుల నేల అని కాంగ్రెస్‌కు తెలియదు. రాముడి అస్థిత్వాన్నే గుర్తించని వారు నన్ను దూషించడానికి రామాయణంలో రావణుడిని కూడా తీసుకొస్తున్నారు. ఇలా తిట్టినందుకు వారు ఎన్నడూ క్షమాపణలు చెప్పకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేయలేదు. ఎందుకంటే వారు మోదీని తిట్టడం, దేశ ప్రధానిని అవమానపరచడం తమ హక్కుగా భావిస్తారు. వారికి గాంధీ కుటుంబమే సర్వస్వం. వారిని సంతోషపెట్టడానికి ఏమైనా చేస్తారు. ప్రస్తుతం మోదీని ఎవరు ఎక్కువ తిట్లు తిడతారన్న పోటీ జరుగుతోంది. కొందరు నన్ను కుక్క చావు చస్తావన్నారు. హిట్లర్లా చనిపోతావన్నారు. ఒక వ్యక్తి అయితే ఇంకా ముందుకు వెళ్లి అవకాశమొస్తే నన్ను చంపడానికి కూడా వెనుకాడనని అన్నాడు. కమలానికి ఓటేసి ఇలాంటి వారికి బుద్ధి చెప్పండి’’ అని మోదీ తెలిపారు. సాబర్‌ కాంటా జిల్లాలో హిమ్మత్‌ నగర్‌లో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్‌కు ఓటు వేసి చేసిన తప్పును మళ్లీ చేయొద్దని గుజరాత్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. భాజపాను అధికారంలోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. అహ్మదాబాద్‌ సిటీలో మోదీ..14 శాసనసభా స్థానాలను చుట్టబెడుతూ 30 కిలోమీటర్ల భారీ రోడ్‌ షో నిర్వహించారు.

కాంగ్రెస్‌  ఎదురుదాడి

మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై విమర్శిస్తున్న భాజపాపై కాంగ్రెస్‌ గురువారం ఎదురుదాడికి దిగింది. గతంలో తమ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌పై ప్రధాని మోదీ అనేక సందర్భాల్లో చేసిన అనుచిత వ్యాఖ్యలను వినే దమ్ముందా? అని నిలదీసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని