రాష్ట్రంలో మాదకద్రవ్యాల సరఫరా వెనుక ఉన్నది వారే!

రాష్ట్రంలో మద్యం ముసుగులో మాదకద్రవ్యాల సరఫరా జరిగినట్లు దిల్లీలోని ఉన్నతవర్గాలు భావిస్తున్నాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వెల్లడించారు.

Updated : 02 Dec 2022 06:37 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: రాష్ట్రంలో మద్యం ముసుగులో మాదకద్రవ్యాల సరఫరా జరిగినట్లు దిల్లీలోని ఉన్నతవర్గాలు భావిస్తున్నాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. ఏపీలో మద్యం విక్రయాల వెనక ఎవరు ఉన్నారో వారే మాదకద్రవ్యాల వెనకా ఉన్నారన్న చర్చ కొనసాగుతోందన్నారు. దిల్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన ఫోను పోయిందని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పడం చూస్తే దిల్లీ మద్యం కుంభకోణంతో ఆయనకు సంబంధం ఉన్నట్లేనని స్పష్టమవుతోందని ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో దుర్గంధాన్ని వెదజల్లే ట్వీట్లు చేస్తున్న వారిపై, ఒక ఎమ్మెల్యే సోదరుడిపై నారా లోకేశ్‌ టీం న్యాయస్థానంలో ఫిర్యాదు చేయడం శుభసూచికమని చెప్పారు. రాష్ట్రంలో పోలీసుల వల్ల హింసకు గురైన వారంతా ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో ఫిర్యాదు చేయాలని, ప్రభుత్వం మారిన తర్వాత వారిపై చర్యలు తీసుకోవచ్చునని తెలిపారు. తనకు ఎటువంటి పేపరు లేదు, ఛానల్‌ మద్దతు లేదని ముఖ్యమంత్రి జగన్‌ బహిరంగంగా అబద్ధం చెప్పారని, సాక్షి దినపత్రిక, ఛానల్‌ ఎవరివని ఆయన ప్రశ్నించారు. బీసీలు తమ పార్టీకి బ్యాక్‌ బోన్‌ అంటూ 5న మీటింగ్‌ ఏర్పాటు చేస్తున్నారని, నియామకాల్లో మాత్రం ఆ సామాజిక వర్గాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని రఘురామ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన చంద్రబాబు సభకు పోటెత్తిన జనాన్ని, మరో వైపు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తుండగానే సభ నుంచి ప్రజలు వెళ్లిపోతున్న దృశ్యాల వీడియోలను రఘురామ ప్రదర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని