ఎన్నికల ఫలితాలపై ఎవరేమన్నారు..

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా సాధించిన చారిత్రక విజయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలు చూపిన విశ్వాసానికి నిదర్శనం అంటున్న కమలనాథులు గురువారం గాంధీనగర్‌లో సంబరాల్లో మునిగి తేలారు.

Published : 09 Dec 2022 05:32 IST

దిల్లీ, అహ్మదాబాద్‌, శిమ్లా: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా సాధించిన చారిత్రక విజయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలు చూపిన విశ్వాసానికి నిదర్శనం అంటున్న కమలనాథులు గురువారం గాంధీనగర్‌లో సంబరాల్లో మునిగి తేలారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆ రాష్ట్ర ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా ప్రచారం, రాహుల్‌ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర హిమాచల్‌లో కాంగ్రెస్‌ విజయానికి దోహదం చేశాయి’ అన్నారు.

గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పార్టీ సమావేశాల్లో, ట్వీట్ల ద్వారా ఆయా పార్టీల నేతలు తమ స్పందనలు తెలియజేశారు.


బూటకపు రాజకీయాలకు తిరస్కారం..

‘‘గుజరాత్‌ ప్రజలు బూటకపు వాగ్దానాలు, బుజ్జగింపులు, ఉచిత రాజకీయాలు చేసేవారిని తిరస్కరించి నరేంద్ర మోదీ అభివృద్ధి నమూనాపై అచంచల విశ్వాసం చూపించారు. భాజపాకు అందించిన ఈ చారిత్రక విజయానికి వారికి సెల్యూట్‌ చేస్తున్నా. గత రెండు దశాబ్దాల్లో మోదీ నాయకత్వంలో భాజపా అభివృద్ధిపరంగా గుజరాత్‌లో అన్ని రికార్డులను బ్రేక్‌ చేసింది. ఈ రోజు గుజరాత్‌ ప్రజలు రికార్డు విజయంతో మమ్మల్ని ఆశీర్వదించారు’’.

అమిత్‌ షా, కేంద్ర హోం మంత్రి


అందరి కృషితో చరిత్ర లిఖించాం..

‘‘ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న జనాదరణ, విశ్వసనీయత గుజరాత్‌ ఎన్నికల్లో భాజపాకు చారిత్రక విజయాన్ని అందించాయి. భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా నుంచి రాష్ట్ర నేతల దాకా అందరూ అలుపెరుగక చేసిన కృషితో భాజపా అన్ని రికార్డులు బద్దలుకొట్టి చరిత్ర లిఖించింది’’.

రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర రక్షణమంత్రి


అన్ని వర్గాల అండతో భాజపా కొత్త రికార్డు..

‘‘అభివృద్ధి దిశలో ప్రధాని మోదీ అంకితభావం సాధించిన చారిత్రక విజయమే గుజరాత్‌ ఎన్నికల ఫలితం. సుపరిపాలన, ప్రజాసంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఆశీర్వదించడంతో భాజపా కొత్త రికార్డు సృష్టించింది. అన్ని వర్గాలు భాజపా విధానాలకు అండగా నిలిచాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ భాజపా పోటాపోటీగా ఓట్లు సాధించింది’’.

జె.పి.నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు


‘‘ఇది మోదీ నాయకత్వానికి ప్రజలు అందించిన విజయం. దేశ వ్యతిరేక శక్తులను గుజరాత్‌ ప్రజలు తిరస్కరించారు’’.

భూపేంద్ర పటేల్‌, గుజరాత్‌ ముఖ్యమంత్రి


సైద్ధాంతిక పోరాటం కొనసాగిస్తాం..

‘‘గుజరాత్‌ ప్రజల తీర్పును సవినయంగా స్వీకరిస్తున్నాం. రాష్ట్ర ప్రజల హక్కులు, దేశ ప్రయోజనాల కోసం మా సైద్ధాంతిక పోరాటం కొనసాగుతుంది. పార్టీని పునర్వ్యవస్థీకరించుకుంటాం, మరింత శ్రమిస్తాం. కాంగ్రెస్‌కు నిర్ణయాత్మక విజయం అందించిన హిమాచల్‌ ప్రదేశ్‌ ఓటర్లకు కృతజ్ఞతలు. పార్టీ నాయకులు, కార్యకర్తల శ్రమ, అంకితభావం అందించిన విజయమిది. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం’’.    

రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత


హిమాచల్‌లో కాంగ్రెస్‌ కష్టం ఫలించింది..  

‘‘హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ నాయకుల కష్టానికి ఫలితం లభించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ మనస్పూర్తిగా శుభాకాంక్షలు. హిమాచల్‌ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజా సమస్యలు, పురోగతికే కట్టుబడి ఉండాలన్న నిబద్ధతకు విజయం దక్కింది’’.  

ప్రియాంకగాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి


గుజరాత్‌ ఫలితాలు దేశ ప్రజల తీర్పు కాదు..

‘‘గుజరాత్‌ ఫలితాలు ఊహించినవే. అయితే, దేశ ప్రజల మనోభావాలను ఇవి ప్రతిబింబించవు. దిల్లీ నగర పాలిక, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. ఒక రాష్ట్రంలో విజయం కోసం భాజపా నేతలు మొత్తం అధికార యంత్రాంగాన్ని, ప్రాజెక్టులను మళ్లించారు’’.  

శరద్‌ పవార్‌, ఎన్సీపీ అధినేత


‘‘గుజరాత్‌ ఓట్లతో ఆప్‌ ఈ రోజు జాతీయపార్టీగా అవతరించింది. విద్య, ఆరోగ్య రాజకీయాలు దేశంలో మొదటిసారి తమ ప్రభావం చూపించాయి.’’

మనీశ్‌ సిసోదియా, దిల్లీ ఉప ముఖ్యమంత్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని