యాసంగి ధాన్యం కొనాల్సిందే

వానాకాలం పంట మాదిరే యాసంగి ధాన్యం కొని తీరాల్సిందేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పంట కొనుగోలుతో రాష్ట్రానికి రూ.7,500 కోట్ల నష్టం వచ్చిందని గత డిసెంబరులో ముఖ్యమంత్రి చెప్పారని, ఇకపై గ్రామాల్లో కొనుగోలు

Published : 01 Dec 2021 04:44 IST

మూడేళ్లుగా బియ్యం సేకరణపై ఆడిట్‌ లేదు: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

‘‘మెడ మీద కత్తిపెట్టి లేఖ రాయించుకున్నారా..? మెడ మీద కత్తి పెడితే బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌కు తెలంగాణను రాసిస్తవా..? నీ ఫాంహౌస్‌ను రాసిస్తవా..? చంద్రబాబు మెడ మీద కత్తిపెడితేనే కృష్ణా నీళ్లను ఆంధ్రప్రదేశ్‌కు రాసిచ్చావా..? హుజూరాబాద్‌ ఎన్నికల సమయంలో మెడపై కత్తిపెట్టారని ఎందుకు చెప్పలేదు.? 

 -బండి సంజయ్‌

ఈనాడు, దిల్లీ: వానాకాలం పంట మాదిరే యాసంగి ధాన్యం కొని తీరాల్సిందేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పంట కొనుగోలుతో రాష్ట్రానికి రూ.7,500 కోట్ల నష్టం వచ్చిందని గత డిసెంబరులో ముఖ్యమంత్రి చెప్పారని, ఇకపై గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఉండవని అప్పుడే ప్రకటించారని గుర్తుచేశారు. దిల్లీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ఎంపీలు ధర్మపురి అర్వింద్‌, సోయం బాపురావులతో కలిసి మంగళవారం సంజయ్‌ విలేకరులతో మాట్లాడారు.‘‘ఇన్నాళ్లూ ప్రతి గింజా మేమే కొంటున్నామని రైతులను మోసం చేసినవ్‌ కదా.. అందుకే యాసంగి ధాన్యం కొనాలని డిమాండ్‌ చేస్తున్నా. బాయిల్డ్‌ రైస్‌ తప్ప తెలంగాణలో వేరే ఏదీ యాసంగిలో పండదని కేసీఆర్‌ పచ్చి అబద్దాలు చెబుతున్నారు. అయిదు రకాల వరి విత్తనాలతో పంట వేస్తే బాయిల్డ్‌ రైస్‌గా మార్చాల్సిన అవసరమే ఉండదని రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడే చెప్పారు. ఆ విత్తనాలు ఎందుకు ఇవ్వడం లేదు. బాయిల్డ్‌ రైస్‌ను కేరళ, తమిళనాడుల్లోనూ తింటలేరు. ఆ బియ్యాన్ని ఏం చేయాలి?

బియ్యం నిగ్గు తేల్చేందుకు యాసిడ్‌ టెస్ట్‌..

రాష్ట్ర ప్రభుత్వం మొదట 40 లక్షల మెట్రిక్‌ టన్నులు పంపుతామని ఒప్పుకుంది. తర్వాత మరో 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపుతామన్నారు. ఒక్కసారే రెట్టింపు ఎలా సాధ్యం? ఈ బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయో నిగ్గు తేల్చేందుకు కేంద్రం యాసిడ్‌ టెస్ట్‌కు సిద్ధమైంది. దాంతో ఆ బియ్యం కొత్తవా? పాతవా?, ఈ రాష్ట్రానివా, పొరుగు రాష్ట్రానివా అనేది తేలుతుంది. కేసీఆర్‌ ప్రభుత్వం మూడేళ్లుగా బియ్యం సేకరణపై ఆడిట్‌ చేయడం లేదు. ఇదంతా బయటకు వస్తుందనే కేసీఆర్‌ కేంద్రంపై నెపం మోపి కొనుగోలు కేంద్రాల మూత నాటకం ఆడుతున్నారు’’ అని సంజయ్‌ విమర్శించారు.

* కర్ణాటకనుంచి తక్కువ నాణ్యమైన బియ్యాన్ని తెచ్చి రీసైకిల్‌ చేస్తూ ఎఫ్‌సీఐకి తెరాస నేతలు అమ్ముతున్నారని ఎంపీ అర్వింద్‌ ఆరోపించారు. బియ్యం స్మగ్లింగ్‌తో వారు రూ.వేల కోట్లు సంపాదిస్తున్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని