విపక్షాల ఉచ్చులో చిక్కుకోవద్దు

గత ఎనిమిదేళ్లుగా తన ప్రభుత్వం సుపరిపాలన, సామాజిక న్యాయం, సామాజిక భద్రతకే ప్రాధాన్యమిచ్చిందని ప్రధాని  మోదీ పేర్కొన్నారు. భాజపా నేతలు జాతి ప్రయోజనాలకే కట్టుబడి ఉండాలని, ప్రధానాంశాల నుంచి దేశం దృష్టి

Published : 21 May 2022 05:13 IST

భాజపా శ్రేణులకు ప్రధాని మోదీ సూచన

ఈనాడు, జైపుర్‌: గత ఎనిమిదేళ్లుగా తన ప్రభుత్వం సుపరిపాలన, సామాజిక న్యాయం, సామాజిక భద్రతకే ప్రాధాన్యమిచ్చిందని ప్రధాని  మోదీ పేర్కొన్నారు. భాజపా నేతలు జాతి ప్రయోజనాలకే కట్టుబడి ఉండాలని, ప్రధానాంశాల నుంచి దేశం దృష్టి మళ్లించాలన్న ప్రతిపక్ష పార్టీల ఉచ్చులో చిక్కుకోవద్దని సూచించారు. రాజస్థాన్‌లోని జైపుర్‌లో నిర్వహించిన పార్టీ పదాధికారుల సమావేశంలో ఆయన శుక్రవారం వర్చువల్‌గా మాట్లాడారు. రాబోయే పాతికేళ్లకు లక్ష్యాలు నిర్దేశించుకుని, వాటి సాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. జాతీయ రాజకీయాల్లోకి భాజపా అభివృద్ధి ఎజెండాను తీసుకొస్తే, కొన్ని పార్టీలు తాత్కాలిక ప్రయోజనాల కోసం దేశ భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం సమాజంలోని చిన్న బలహీనతలను చూసి, ఆ ఘటనల్లో విషం నింపుతున్నాయన్నారు. ‘ఒకే భారత్‌.. శ్రేష్ఠభారత్‌’ అన్న కల దిశగా భాజపా ముందుకెళ్తోందని, దీన్ని అడ్డుకునే శక్తులపై ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. 2014 తర్వాత దేశ ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని పునరుద్ధరించగలిగినట్లు ఆయన తెలిపారు. వారసత్వ రాజకీయాలపైనా మోదీ తన దాడిని కొనసాగించారు. కొన్ని పార్టీలు కుటుంబ ప్రయోజనాల కోసం దేశానికి చాలా నష్టం చేశాయని, ఇలాంటివాటితో పోరాడుతూ ప్రజాస్వామ్యాన్ని భాజపా కాపాడుతోందని ప్రధాని చెప్పారు.

భారతీయ భాషలన్నీ పూజనీయమే

భాషా ప్రాతిపదికన వివాదాలు రేకెత్తించే ప్రయత్నాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని భాజపా నాయకులకు ప్రధాని సూచించారు. భారతీయ భాషలన్నింటిలో భారతీయ ఆత్మ ఉంటుందని, అవన్నీ పూజనీయమేనని తమ పార్టీ భావిస్తుందన్నారు. జాతీయ విద్యావిధానంలో స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇవ్వడమే తమ నిబద్ధతను సూచిస్తుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని