logo

జగన్‌ ప్యాలెస్‌కు కోట్లు.. పర్యటకానికి తూట్లు

రిషికొండలో జగన్‌ ప్యాలెస్‌ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు.

Published : 26 Apr 2024 07:58 IST

ఆదాయం స్వాహాపైనే ప్రభుత్వ దృష్టి

రిషికొండలో జగన్‌ ప్యాలెస్‌ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. పర్యటక శాఖ మంత్రిగా ఉన్న రోజా ఒక్కసారి కూడా అరకులోయ వైపు కన్నెత్తి చూడలేదు. ఇదీ జగన్‌ ప్రభుత్వానికి పర్యటకంపైనున్న శ్రద్ధ.

అరకులోయ, చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే

పర్యటకుల మది చూరగొనే ప్రకృతి అందాలు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో పుష్కలంగా ఉన్నాయి. అరకు, లంబసింగికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తున్నారు. ఏటేటా వీరి సంఖ్య పెరుగుతోంది. అందుకు తగ్గట్టు ప్రభుత్వ ఖజానాకు రూ. కోట్లు జమవుతున్నాయి. వచ్చిన ఆదాయం వచ్చినట్టు మింగేస్తున్న సర్కారు వసతుల కల్పనకు రూపాయి కూడా బయటకు తీయడం లేదు. దేశంలోని మిగిలిన ప్రాంతాలు కొంగొత్త హంగులతో దూసుకుపోతుంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఐదేళ్లగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయాయి.

నాడు..  

తెదేపా హయాంలో అరకులోయ ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించింది. చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అరకులో బెలూన్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. ఈ ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి సాహసికులు తరలివచ్చారు. మూడురోజులపాటు దేశం మొత్తం అరకువైపే చూసింది. విదేశీయులు సైతం స్విట్జర్లాండ్‌ను తలపించే అందాలు ఇక్కడున్నాయంటూ ప్రశంసించారు. దీనికితోడు ఏటేటా క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు అరకు ఉత్సవ్‌ నిర్వహించారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలను బాహ్య ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ ఉత్సవాలు ఎంతగానో దోహదపడ్డాయి.

నేడు..

అరకులోయ ఆకర్షణలు మెరుగుపరచాల్సిన బాధ్యతను పర్యటక శాఖ గాలికొదిలేసింది. ఐదేళ్ల కాలంలో అతిథి గృహాలకు రంగులు సైతం వేయలేదు. మన్యంలోని సందర్శక ప్రాంతాల నుంచి వచ్చే ఆదాయాన్ని దిగమింగి ఈ ప్రాంతాల అభివృద్ధి తమ బాధ్యత కాదన్నట్టు ప్రభుత్వ పెద్దలు ఊరుకుండిపోయారు.  

అతిథులకు అవస్థలే

అరకులోయ, అనంతగిరి, టైడాలో పర్యటకశాఖకు నాలుగు అతిథి గృహాలున్నాయి. వీటన్నింటి నుంచి ఏటా రూ. 2 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. అరకులోయ, టైడా జంగిల్‌బెల్స్‌లో గదులు పాడయినా, అంతర్గత రహదారులు పూర్తిగా దెబ్బతిన్నా పట్టించుకోని పరిస్థితి. కొత్త ప్రాజెక్టులు ఎక్కడా ప్రారంభించలేదు. రోజా పర్యటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కసారి కూడా అరకులోయ సందర్శించలేదు. ఆంధ్రా కశ్మీర్‌గా పేరు తెచ్చుకున్న లంబసింగిలో వీఐపీలు, సందర్శకుల విడిది కోసం హరిత హిల్స్‌ రిసార్ట్స్‌ నిర్మించేందుకు తెదేపా ప్రభుత్వం రూ. 3.5 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతోనే విడతల వారీగా 15 కాటేజీలు నిర్మించారు. గతేడాది కొన్ని కాటేజీలను ప్రారంభించారు. జగన్‌ రిసార్ట్స్‌ నుంచి అద్దె రూపేణా డబ్బులు వసూలు చేయడం తప్ప అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయలేదు.

రూ. కోట్లు వస్తున్నా అంతే

అనంతగిరి/గ్రామీణం, న్యూస్‌టుడే: బొర్రా గుహలకు నిత్యం వేలాదిమంది పర్యటకులు వస్తుంటారు. ప్రవేశ రుసుం రూపేణా ప్రభుత్వానికి ఏటా రూ. 3 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఈ ఐదేళ్లలో ప్రభుత్వానికి సుమారు రూ. 12 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఇంత ఆదాయం వస్తున్నా ఈ ప్రాంతంలో వసతుల మెరుగుకు ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేయలేదు. ఆటోమేటిక్‌ గేట్లు పాడయినా బాగు చేసేందుకు సైతం డబ్బులివ్వలేదు. ఎలక్ట్రానిక్‌ ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేసేందుకు సామగ్రిని తెచ్చినా వాటిని అమర్చకుండా పక్కన పడేశారు.

రహదారి సదుపాయమూ కరవే

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మారేడుమిల్లిలో తెదేపా ప్రభుత్వ హయాంలో సుమారు రూ.14 కోట్ల వ్యయంతో ‘ది ఉడ్స్‌’ పేరుతో రిసార్ట్సు నిర్మించారు. వైకాపా పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. దీంతో ప్రైవేటు నిర్వాహకులదే ఇష్టారాజ్యంగా మారింది. నిత్యం వేలాది మంది పర్యటకులు వచ్చే ‘గుడిస’ కొండపై కనీస సదుపాయాలు కల్పించకపోగా, రహదారిని నిర్మించలేదు. గత ప్రభుత్వ హయాంలో గుడిస పర్యటకులకు వసతి సదుపాయం కల్పించే లక్ష్యంతో పుల్లంగి పంచాయతీ గుండ్రాతి గ్రామం వద్ద కాటేజీలు, రిసార్ట్సు నిర్మాణ పనులు ప్రారంభించారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టులు మూలన పడిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు