Telangana News: కళ్లుండీ చూడలేని వారికి అభివృద్ధి కనిపించదు: హరీశ్‌రావు

భాజపా నేతలపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు మరోసారి ధ్వజమెత్తారు. కళ్లుండీ చూడలేని..

Published : 28 Aug 2022 01:18 IST

హైదరాబాద్‌: భాజపా నేతలపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు మరోసారి ధ్వజమెత్తారు. కళ్లుండీ చూడలేని వారికి అభివృద్ధి కనిపించదని, నోరు తెరిస్తే జూటా మాటలు ప్రచారం చేసే భాజపా నేతలకు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వ‌ల్ల క‌లిగే ప్రయోజ‌నాలు అర్థం కావన్నారు. హనుమకొండలో జరిగిన బహిరంగసభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ట్విటర్‌ ద్వారా స్పందించారు. చారిత్రక వరంగల్‌ నగరాన్ని హెల్త్‌ సిటీగా మార్చాలని కేసీఆర్‌ సంకల్పించారని.. 24 అంతస్తుల్లో 2వేల పడకలతో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ.1100 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. వెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టి, శరవేగంగా పనులు ప్రారంభించిందన్న ఆయన.. మూడు నెలల్లోనే 15శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. ఆసుపత్రి నిర్మాణ పనుల చిత్రాలను ట్విటర్‌లో పోస్టు చేశారు.  వరంగల్‌లో నిర్మాణంలో ఉన్నది ఆసుపత్రి మాత్రమే కాదని.. ప్రభుత్వ రంగంలో దేశంలోనే నిర్మిస్తున్న ఒకే ఒక అధునాతన హెల్త్ సిటీ అని పేర్కొన్నారు. ఇది పూర్తయితే ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందటంతో పాటు వైద్య విద్య, పరిశోధనలకు కేంద్రంగా వరంగల్ నిలుస్తుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని