Rahul Gandhi: కారు అద్దంలో చూస్తూ.. మోదీ డ్రైవింగ్ చేస్తున్నారు..!

అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gndhi).. భాజపాపై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ నేతలు తమ ప్రతి వైఫల్యానికి సాకులు వెతుక్కుంటారని దుయ్యబట్టారు.

Published : 05 Jun 2023 10:41 IST

న్యూయార్క్: ప్రధాని నరేంద్రమోదీ(PM modi), భాజపా(BJP) నేతలు ఎన్నడూ భవిష్యత్తు గురించి మాట్లాడరని, తమ వైఫల్యాలకు గత ప్రభుత్వాలపై నిందలు వేస్తుంటారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన న్యూయార్క్‌లో ప్రవాస భారతీయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒడిశా రైలు దుర్ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ.. నిమిషం పాటు మౌనం పాటించారు.

‘‘కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన రైలు ప్రమాదం నాకు గుర్తుంది. ఈ ప్రమాదానికి బ్రిటిషర్లే కారణమని ఆ రోజు కాంగ్రెస్ అనలేదు. ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ.. అప్పటి రైల్వే శాఖ మంత్రి మాట్లాడుతూ..‘దానికి పూర్తి బాధ్యత నాదే.. నేను రాజీనామా చేస్తున్నా’ అని ప్రకటించారు. కానీ ఇప్పటి నేతలు సాకులు వెతుకుతున్నారు. ఎదురవుతున్న వైఫల్యాలను అంగీకరించడం లేదు. ఇప్పుడు భారత్‌లో ఇదే సమస్య నెలకొని ఉంది’’ అని రాహుల్ అధికార భాజపాపై విమర్శలు గుప్పించారు. ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపా భవిష్యత్తును చూడలేకపోతున్నాయని అన్నారు.

‘ఆయన(ప్రధాని మోదీ) ఇండియా అనే కారును నడిపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన ముందుకు చూడకుండా కారు అద్దం( rear-view mirror)లో చూసి డ్రైవ్ చేస్తున్నారు. కారు ముందుకు పోకుండా ఎందుకు ప్రమాదాలకు గురవుతుందో ఆయనకు అర్థం కావడం లేదు. దేశంలో ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉంది. ప్రధాని, మంత్రులు, భాజపా నేతలు, ఆర్‌ఎస్‌ఎస్.. అంతా ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి మాట్లాడినట్లు మనకు కనిపించదు. వారెప్పుడూ గతాన్నే తవ్వుతారు. వారు ముందుకు చూడలేకపోతున్నారు. వారి వైఫల్యాలకు గతంలోని వ్యక్తుల్ని, ప్రభుత్వాలను నిందిస్తుంటారు’ అని వ్యాఖ్యానించారు. దేశంలో రెండు సిద్ధాంతాల మధ్యే పోరాటం జరుగుతోందన్నారు. ఒకదానికి కాంగ్రెస్, మరోదానికి భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా రాహుల్ ప్రవాసభారతీయులు సాధిస్తోన్న విజయాలను కొనియాడారు.

ఇదిలా ఉంటే.. శుక్రవారం రాత్రి ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం(Odisha train accident) చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గూడ్స్‌, రెండు ప్రయాణికుల రైళ్లు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ పెను విషాదం 275 మంది ప్రాణాలు తీసిందని ఒడిశా ప్రభుత్వం వెల్లడించింది. తొలుత ఈ సంఖ్య 288గా వచ్చిందని, అది తప్పని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని