Himachal polls: హిమాచల్‌లో ముగిసిన పోలింగ్‌.. విజయం ఎవరిదో..?

హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 65.5 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Updated : 12 Nov 2022 19:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. మొత్తం 86 స్థానాల్లో సాయంత్రం 5 గంటల వరకు 65.5 శాతం పోలింగ్‌ నమోదైంది.  చరిత్రను తిరగరాస్తూ వరుసగా రెండోసారి అధికారం చేపట్టాలని చూసిన భాజపా, ఎలాగైనా అధికారం హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్‌ చేసిన యత్నాలు ఎంతమేర ఫలించాయన్నది డిసెంబరు 8న తేలనుంది. ఈ నేపథ్యంలో హిమాచల్‌ ఎన్నికల్లో కొన్ని విశేషాలు..

  •  2017 ఎన్నికల్లో మొత్తం 68 సీట్లకుగానూ భాజపా 44, కాంగ్రెస్‌ 21 స్థానాలను గెలుచుకున్నాయి. అయితే భాజపా  ఈసారి ప్రధాని మోదీ పేరుతోనే ఓట్లను అభ్యర్థించింది. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది.
  •  కాంగ్రెస్‌ ప్రధానంగా స్థానిక సమస్యలను తమ ప్రచార అస్త్రాలుగా మలచుకుంది. 1982 నుంచి వస్తున్న ఆనవాయితీని హిమాచల్‌ ప్రజలు కొనసాగిస్తారని ఆశిస్తోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సీట్ల కేటాయింపులోనూ ఆచితూచి వ్యవహరించింది.
  •  వరుసగా రెండోసారి అధికారం చేపట్టాలని చూసిన భాజపాకు రెబల్స్‌ తలనొప్పిగా మారారు. మొత్తం 21 మంది రెబల్స్‌ పార్టీకి వ్యతిరేకంగా మారారు. సీనియర్‌ మంత్రులు కూడా తమ వారసులకు టికెట్‌ దక్కలేదన్న కారణంతో ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
  •  ప్రచారంలో భాజపా దూసుకుపోయింది. ప్రధాని మోదీతో సహా సీనియర్‌ నేతలు యోగి ఆదిత్యనాథ్‌, జేపీ నడ్డా తదితరులు విస్త్రృత ప్రాచారం చేశారు. కానీ, రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో ఉండటంతో.. కాంగ్రెస్‌ నుంచి ప్రియాంక గాంధీ మాత్రమే కీలక ప్రచారం నిర్వహించారు. చివర్లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వచ్చి చేరారు.
  • పొరుగు రాష్ట్రం పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్‌ పరాభవం చవి చూసింది. ఈ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా హిమాచల్‌ ఎన్నికల్లో  బరిలో నిలిచింది. దీంతో ఈసారి ఇక్కడ త్రిముఖ పోరు జరిగింది.
  •  హిమాచల్‌ ప్రదేశ్‌లో 55 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌ కోసం 7,884 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. కేవలం 52 మంది కోసం లాహాల్‌ స్పితి జిల్లాలోని ఖాజా, తషిగాంగ్‌లో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇది సముద్రమట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉంది.
  •  2019 లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్‌ ప్రదేశ్‌లో 72.4 శాతం పోలింగ్‌, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 74.16శాతం పోలింగ్‌ నమోదైంది. గడిచిన 15 ఏళ్లలో ఇదే అత్యధిక పోలింగ్‌.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని