Rahul Gandhi: అలాంటి వారు పార్టీని వీడటం మంచిదే: రాహుల్‌ గాంధీ

హిమంత బిశ్వశర్మ, మిలింద్‌ దేవ్‌రా వంటి నేతలు కాంగ్రెస్‌ నుంచి వెళ్లిపోవడమే మంచిదని పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు.

Published : 02 Feb 2024 20:21 IST

కోల్‌కతా: పార్టీ సిద్ధాంతాలతో ఏకీభవించలేని వారే కాంగ్రెస్‌ (Congress)ను వీడుతున్నారని అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) తెలిపారు.  కొంత కాలంగా ముఖ్య నేతలు పార్టీ నుంచి వెళ్లిపోతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర (Bharat Jodo Nyay Yatra)లో భాగంగా పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లోని బహరామ్‌పూర్‌లో డిజిటల్‌ మీడియా కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలను కాపాడేందుకు నిబద్ధతతో పనిచేస్తున్నట్లు తెలిపారు. 

‘‘హిమంత బిశ్వశర్మ, మిలింద్‌ దేవ్‌రా లాంటి వాళ్లు పార్టీ నుంచి వెళ్లిపోవాలని నేను కోరుకుంటున్నా. దాంతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. హిమంత ఒక విధమైన రాజకీయాలకు ప్రాతినిధ్యం వహిస్తాడు. అలాంటివి కాంగ్రెస్ చేయదు. ఒక వర్గం ప్రజల గురించి ఆయన చేసే వ్యాఖ్యలు మీరూ వినే ఉంటారు. వాటిని నేను సమర్థించను. అందుకే ఆయన పార్టీ నుంచి వెళ్లిపోవడమే మంచిది. పౌరసత్వ సవరణ చట్టాన్ని భాజపా తన విభజన వాదం కోసం వాడుకోవాలని చూస్తోంది’’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. 

కాంగ్రెస్‌లో కీలక నేతలుగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా, జితిన్‌ ప్రసాద్‌, సునీల్‌ జాఖఢ్‌, అశ్వనీకుమార్‌, ప్రియాంక చతుర్వేది, హార్దిక్‌ పటేల్‌, సుస్మితాదేవ్‌, ఆర్‌పీఎన్‌ సింగ్‌, గులాంనబీ ఆజాద్‌, అనిల్‌ ఆంటోనీ, అమరీందర్‌ సింగ్‌ వంటి వారు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. వీరిలో ఎక్కువమంది భాజపాలో చేరారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్‌ నుంచి వెళ్లిపోతున్న నేతల గురించి రాహుల్‌ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 

పశ్చిమబెంగాల్‌లో టీఎంసీతో సీట్ల సర్దుబాటుపై నెలకొన్న సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు. దీనిపై ఇరు పార్టీలు చర్చలు జరుపుతున్నాయన్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల కోసం ‘ఇండియా’ కూటమి ఏర్పాటుకాలేదని, లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఓడించాలనే లక్ష్యంతో ఏర్పాటైందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ అన్నారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు కలసికట్టుగా పోటీ చేస్తాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని