పట్టణ పేదలకు ఉపాధి హామీ తరహా స్కీమ్‌: కేంద్రమంత్రికి KTR వినతి

దిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ కేంద్రమంత్రులు హర్దీప్‌ సింగ్‌ పురీ, పీయూష్‌ గోయల్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లు వారి ముందుంచారు.

Updated : 24 Jun 2023 19:50 IST

దిల్లీ: గ్రామీణ ఉపాధి హామీ తరహాలో పట్టణ పేదలకూ ఓ పథకం ఉండాలని తెలంగాణ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. రాబోయే బడ్జెట్‌లో ఇందు కోసం ఓ పథకాన్ని ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు. దిల్లీలో రెండో రోజు పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీతో శనివారం జరిగిన భేటీలో ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందించాలని కోరారు.

రోజురోజుకూ పట్టణ జనాభా అంతకంతకూ పెరుగుతోందని, భవిష్యత్‌లో ఇది మరింత పెరగబోతోందని కేటీఆర్‌ అన్నారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆయా నగరపాలక సంస్థలకు ఈ వ్యవహారం సంక్లిష్టంగా మారే అవకాశం ఉందన్నారు. అందుకే గ్రామీణ స్థాయిలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఉన్నట్లే పట్టణ పేదలకూ ఓ పథకం ఉండాలన్నారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం జాబ్‌ కార్డులు జారీ చేసి నగర స్థాయిలో వారి సేవలను వినియోగించుకుంటుందని చెప్పారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ ఫేజ్‌-2 (బి) పనులకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు ఫేజ్‌-1లోని కారిడార్‌-3లో ఉన్న నాగోల్‌ నుంచి ఎల్‌బీ నగర్‌ వరకు మెట్రో రైలు విస్తరణకు నిధులు సమకూర్చాలని మంత్రిని కోరారు. లింకు రోడ్డుల నిర్మాణానికి నిధులు సమకూర్చాలన్నారు. వీటితో పాటు ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్ట్‌, హైదరాబాద్‌-వరంగల్‌ నడుమ వేగవంతమైన రవాణా వ్యవస్థ, శానిటేషన్‌ హబ్‌ ఏర్పాటు వంటి అంశాలను ప్రస్తావించారు.

పీయూష్‌ గోయల్‌తోనూ భేటీ

దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తోనూ కేటీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ పురోగతిని వివరించడంతో దాని ప్రాధాన్యతను మంత్రికి వివరించారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో వరి ధాన్యం పండుతోందని, కాబట్టి రాష్ట్రం నుంచి అదనంగా 20 లక్షల మెట్రిక్‌ టన్నుల బాయిల్డ్‌  రైస్‌ను సేకరించాలని కోరారు. కేటీఆర్‌తో పాటు ఎంపీలు రంజిత్‌ రెడ్డి, కొత్త ప్రభాకర్‌ రెడ్డి ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని