అంబులెన్సులు ఆపడం సరికాదు: కిషన్‌రెడ్డి

కొవిడ్‌ చికిత్స కోసం ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులు ఆపడం సంప్రదాయం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం

Updated : 24 Sep 2022 17:08 IST

హైదరాబాద్‌: కొవిడ్‌ చికిత్స కోసం ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులు ఆపడం సంప్రదాయం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారం ఉండాలన్నారు. రెండు రాష్ట్రాలు చర్చించుకొని సమస్య పరిష్కరించుకోవాలని కోరారు. హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ప్రభుత్వం గౌరవించాలని, తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులను ఆపడం సరికాదని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ వచ్చేందుకు అంబులెన్స్‌లకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలన్నారు. ఈవిషయమై  తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కేంద్ర హోంశాఖ కార్యదర్శి,మాట్లాడారని అన్నారు.

రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణకు వచ్చే అంబులెన్స్‌లను ఆపే హక్కు ఎవరిచ్చారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. రాష్ట్రప్రభుత్వ మార్గదర్శకాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అంబులెన్స్‌లు నియంత్రించేలా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని, అంబులెన్స్‌లను అడ్డుకునేందుకు మరో రూపంలో ప్రయత్నించవద్దని తెలిపింది. ఆస్పత్రుల్లో చేరేందుకు కంట్రోల్‌రూమ్‌ అనుమతి అక్కర్లేదని స్పష్టం చేసింది. ప్రజలు కోరుకుంటే కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేయవచ్చని, ఫోన్ చేసిన వారికి కంట్రోల్‌రూమ్‌ సహకరించాలని ఆదేశించింది. రెండు వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని కోరుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేంద్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని